
ప్రయాణికుల సౌకర్యాలకు, భద్రతకు పెద్దపీట
న్యూఢిల్లీ: భద్రత, శుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ 2014-15 రైల్వే బడ్జెట్ ను రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టారు. భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, ఇందుకు రూ.11719 కోట్లు వెచ్చించనున్నామని చెప్పారు. 4 వేల మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమించి అన్ని తరగతుల్లోనూ ప్రయాణించే మహిళల భద్రతను పరిరక్షిస్తామన్నారు. వీరికి మొబైల్ ఫోన్లు కూడా ఇస్తామని, వాటి ద్వారా ప్రయాణికులు ఏ కోచ్ నుంచి అయినా వారిని సంప్రదించే అవకాశం ఉంటుందని వివరించారు.
ఎఫ్ఓబీలు, ఎస్కలేటర్లను ప్రధాన స్టేషన్లలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుచేస్తామన్నారు. అన్ని స్టేషన్లలో ప్రైవేటు మార్గాల ద్వారా బ్యాటరీ ఆపరేటెడ్ కార్లు పెడతామని వీటివల్ల వృద్ధులు, వికలాంగులు ఏ ప్లాట్ ఫారాల మీదకైనా వెళ్తారని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలను కూడా ప్రయాణికుల సౌకర్యాల్లో భాగస్వాములను చేస్తామన్నారు. కొన్ని రైళ్లలో వర్క్ స్టేషన్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడతామన్నారు.
ఆహారం నాణ్యత, పరిశుభ్రత పెంచేందుకు రెడీ టు ఈట్ మీల్స్ను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి తెలిపారు. ఆహార నాణ్యతపై థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రయాణికుల నుంచి ఆహార నాణ్యతపై అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. నాణ్యత లేకపోతే అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన స్టేషన్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, స్మార్ట్ ఫోన్ల ద్వారా వీటికి ఆర్డర్ చేయచ్చని తెలిపారు.
రైళ్లు, స్టేషన్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 50 ప్రధాన స్టేషన్లలో పారిశుధ్యాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తామన్నారు. సీసీ టీవీల ద్వారా కూడా స్టేషన్లలో పరిశుభ్రతను పరిశీలిస్తాం. బయో టాయిలెట్లను చాలావరకు రైళ్లలో పెడతామన్నారు. మెకనైజ్డ్ లాండ్రీలను ఏసీ కోచీల కోసం ఏర్పాటుచేస్తామన్నారు. ఆర్ఓ తాగునీటి ప్లాంట్లను స్వచ్ఛంద సంస్థల సాయంతో రైళ్లు, స్టేషన్లలో ఏర్పాటుచేస్తామని చెప్పారు.