పఠాన్కోట్లో మళ్లీ కలకలం: హై అలర్ట్..!
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ లో మళ్లీ కలకలం చెలరేగింది. గత రాత్రి పోలీసుల తనిఖీల్లో సైనిక దుస్తులతో కూడిన ఒక బ్యాగ్ దొరకడం అలజడి సృష్టించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు సోమవారం హై అలర్ట్ జారీ చేశారు. ఆర్మీ, స్వాత్ కమాండోల ఆధ్వర్యంలో ఉమ్మడిగా భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
మమున్ ఆర్మీ కంటోన్మెంట్కు సమీపంలో అనుమానాస్పద బ్యాగ్ దొరకడంతో భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మూడు సైనిక దుస్తులను కొనుగొన్నామని పోలీసులు తెలిపారు. వీటిపై జమ్మూ అని రాసివుందని సీనియర్ పోలీస్ అదికారి ఒకరు చెప్పారు. వీటిని ఒక గోనె సంచిలో కుక్కి ఉండగా కనుగొన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో సైన్యాన్ని, స్వాత్ కమాండోలను మోహరించామన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కాగా మే 4న మిలిటరీ బేస్‌కు కూతవేటు దూరంలో అనుమానాస్పదంగా పడివున్న నాలుగు సంచులను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఒక మొబైల్ టవర్ బ్యాటరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో 7గురు జవాన్లు అసువులు బాయగా, దాదాపు 37మంది పౌరులు క్షతగాత్రులైన సంగతి తెలిసిందే