బీజేపీ ఎంపీపై నిప్పులు చెరిగిన పవన్
హైదరాబాద్: 'ఉత్తరాది' అహంకారం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి గర్జించారు. 'నల్లగా ఉండే దక్షిణ భారతీయులతో మేం కలిసి ఉండట్లేదా?' అన్న బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ వికృత వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇలాంటి వివక్షలు జాతిని గీతలు గీసిమరీ విడదీస్తాయని మండిపడ్డారు. 'ఆయన (తరుణ్ విజయ్) క్షమాపణలు చెప్పినంత మాత్రాన మర్చిపోయే అవమానం కాదిది' అని గర్హించారు. ఈ మేరకు పవన్ శుక్రవారం రాత్రి వరుస ట్వీట్లతో తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
'ఉత్తరాది అహంకారం మొత్తం మీ మాటల్లో కనిపిస్తోంది. నల్లగా ఉన్నందుకు కోకిలను నిషేధించండి. మీరు ఎగురవేసే జాతీయ పతాకం ఒక దక్షిణాది మహనీయుడు రూపకల్పనే'అని ఎంపీ తరుణ్‌కు చురకలేసిన పవన్.. దక్షిణ భారతీయుల చెల్లించే రెవెన్యూకు ప్రతిగా వారికి మీరేం చేస్తున్నారు? అని నిలదీశారు.
ఏమిటీ వివాదం?
ఇద్దరు నైజీరియా విద్యార్థులపై నోయిడాలో జరిగిన దాడిపై 'ఆల్ జజీరా' చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయులను జాత్యహంకారులు కారని, నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తారని, జాతివివక్ష ఉంటే గనుక నల్లగా ఉండే దక్షిణ భారతీయులతో కలిసి ఎలా నివసిస్తామని తరుణ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
(చదవండి: బీజేపీ నేత జాత్యహంకార వ్యాఖ్యలు)