
పాక్ నుంచి పావురం రెక్కపై ఉర్దూలో రాసి
చంఢీఘడ్: రెక్కలపై ఉర్దూ భాషలో అక్షరాలు రాసివున్న పావురం పంజాబ్ లో కలకలం సృష్టించింది. ఈ పావురాన్ని పరిశీలిస్తున్న ఇంటిలిజెన్స్ అధికారులు పాకిస్తాన్-ఇండియా బోర్డర్ ను దాటి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోషయాపూర్ జిల్లా మోట్లా గ్రామంలో ఓ వ్యక్తి తెల్లపావురం రెక్కలపై ఉర్దూలో రాసివుందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
దాంతో ఆ ప్రాంతానికి చేరుకుని పావురాన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పావురం రెక్కలపై ఉర్దూలో రాసివున్న అక్షరాలను ఆర్మీ, ఇంటిలిజెన్స్ అధికారులు పరిశీలించినట్లు పేర్కొన్నారు. పావురానికి ఎక్స్ రే స్కానింగ్ పరీక్ష కూడా చేయించినట్లు చెప్పారు. రెక్కలపై పదకొండు అంకెలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఆ నంబర్లు రహస్యంగా చేరవేస్తున్న ఫోన్ నంబరా? పాకిస్తాన్ నుంచి ఆ పావురం వచ్చిందా? వంటి కోణాల్లో దర్యాప్తు సాగుతున్నట్లు చెప్పారు.
రెక్కలపై నంబర్లతో పాటు ఉర్దూలో కొన్ని పదాలతో పాటు గుర్తుతెలియని ఒక స్టాంప్ కూడా ఉందని పేర్కొన్నారు. కొన్ని పదాలను తర్జూమా చేయగా.. ఆదివారం, బుధవారం, గురువారం అని రాసి ఉందని తెలిపారు. గత ఏడాది కూడా పఠాన్ కోట్ జిల్లాలో రెక్కలపై ఉర్దూలో రాసివున్న పావురాన్ని అధికారులు గుర్తించారు. పఠాన్ కోట్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ పై ముష్కరాలు దాడి చేసిన విషయం తెలిసిందే.