
బాంబ్ నాగా ఇంట్లో పాతనోట్ల గుట్టలు
- ‘కట్టల’పాము కోసం వేట.. అంతలోనే పోలీసులకు మెసేజ్
- తండ్రికి సాయంగా నాగా కొడకులు గాంధీ, శాస్త్రీ
- దందాలో రాజకీయప్రముఖుల హస్తం!
బెంగళూరు: మాజీ కార్పొరేటర్ బాంబ్ నాగా అలియాస్ వి.నాగరాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఈ కరుడుగట్టిన నేరగాడి ఇంట్లో రూ.25 కోట్ల విలువైన రద్దయిన రూ.1000, రూ.500 నోట్లను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగా పోలీసులకు ఝలకిచ్చి సినీఫక్కీలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం అతను తమిళనాడులో తలదాచుకున్నట్లు సమాచారం. పోలీసుశాఖలో పరిచయస్థులైన కొంత మంది సీనియర్ అధికారుల సహాయంతో కోర్టులో లొంగిపోవడానికి నాగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
కాయిన్ బాక్స్‌ల ద్వారా నాగరాజు తన అనుచరులకు ఫోన్లు చూస్తూండటాన్ని పసిగట్టిన పోలీసులు.. అతను తమిళనాడులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో బెంగళూరు నుంచి బయలుదేరిన పోలీసు బృందాలు.. వేలూరు, ధర్మపురి, కాట్పాడి, చెన్నై తదితర ప్రాంతాల్లో విసృతంగా గాలిస్తున్నాయి. బాంబ్‌నాగతో పాటు తప్పించుకున్న రౌడీషీటర్లైన అతడి కుమారులు గాంధీ, శాస్త్రీల కోసం కూడా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరిద్దరూ బెంగళూరులోనే వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు తన తండ్రికి తెలియజేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ దందాతో పాటు వ్యాపారవేత్తలను, బిల్డర్లను బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూడడంతో 45 కేసుల్లో నిందితుడిగా ఉన్న బాంబ్‌నాగపై కోకా యాక్ట్ ప్రయోగించడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా, నాగా నేరాల్లో పలువురు రాజకీయ ప్రముఖులకూ సంబంధాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎవరీ బాంబ్ నాగా?
వి.నాగరాజ్ అలియాస్ బాంబ్ నాగా.. పశ్చిమ బెంగళూరులో పేరుమోసిన రౌడీ షీటర్. శ్రీపురంలో మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతంలోని ఇతని ఇంటిపై శుక్రవారం బెంగళూరు పోలీసులు దాడి చేయగా.. రూ.25కోట్ల విలువైన పాతనోట్ల కట్టలు బయటపడ్డాయి. నాగా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, ఎత్తైన ఇనుప గేట్లతో పకడ్బందీగా రక్షణ ఏర్పాట్లు ఉండటం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది. నాగా ఇంట్లోకి ప్రవేశించడానికి పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. చివరికి ఐరన్‌రాడ్లను కట్ చేసే వారిని తీసుకొచ్చి గేట్లను తెరిచారు.
పోలీసులు దాడి చేసిన సమయంలో నాగా ఇంట్లో లేడు. అతని ఇంట్లోని పాత నోట్లను లెక్కించేందుకు పోలీసులకు 5 గంటలకుపైగా సమయం పట్టింది. పలు రాజకీయ హత్యలు.. కిడ్నాపు కేసుల్లో నాగా నిందితుడిగా ఉన్నాడు. గతంలో బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో.. అసెంబ్లీ ఎన్నికల్లో నాగా పోటీ చేసి ఓడిపోయాడు. ఓ కిడ్నాప్ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు నాగా ఇంటిపై పోలీసులు దాడి చేశారు. కాగా, అసోంలోని గువాహటిలో రూ.1.10 కోట్ల విలువైన రద్దయిన నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 9 బంగారు కడ్డీలను.. కేజిన్నర బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు.