
మోదీ బొమ్మను ఎందుకు తగలబెట్టారు?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మరికొందరిని రావణుడిగా చిత్రీకరిస్తూ దసరా రోజున వారి దిష్టిబొమ్మను కొందరు విద్యార్థులు క్యాంపస్ ప్రాంగణంలో తగలబెట్టడంపై జవరహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) బుధవారం విచారణకు ఆదేశించింది. గుజరాత్ ప్రభుత్వం, గోరక్షకుల దిష్టిబొమ్మలను దహనం చేసినందుకు సంబంధిత విద్యార్థులకు వర్సిటీ వారం కిందటే షోకాజ్ నోటీసులు జారీచేసి, విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దసరా రోజున దేశమంతా పాక్ ప్రధాని షరీఫ్‌తోపాటు 26-11 ముంబై దాడుల నిందితుడు హఫీజ్ సయీద్, ఇతర ఉగ్రవాదుల తలలతో కూడిన దిష్టిబొమ్మలను తగలబెట్టగా.. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ మాత్రం రావణున్ని ప్రతిబింబించేలా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ముఖాలతో ఉన్న చిత్రాలతో ఉన్న దిష్టిబొమ్మను తగలబెట్టింది.
చేసిన వాగ్దాలను నిలుపుకోవడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, విద్యా సంస్థలపై వరుస దాడులకు వ్యతిరేకంగా తమ నిరసనను ఇలా వ్యక్తం చేశామని విద్యార్థులు చెప్తున్నారు. దసరా నాటి ఈ కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదన్న వర్సిటీ ప్రకటనపై స్పందిస్తూ.. క్యాంపస్‌లో దిష్టి బొమ్మ దహనం నిత్యకృత్యమేనని, దీనికి అనుమతి అక్కర్లేదని వారు అంటున్నారు. మోదీ, షాలతో పాటు యోగా గురువు బాబా రాందేవ్, బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా, ఆసాకరాం బాపు, నాథురాం గాడ్సే, జేఎన్‌యూ ఉపకులపతి జగదీష్ కుమార్‌ల ముఖాలు కూడా తగలబెట్టిన దిష్టిబొమ్మలో ఉన్నాయి