
కేజ్రీవాల్ ఆరోగ్యం కోసం ప్రార్థించాను: మోదీ
న్యూఢిల్లీ: రాజకీయాల్లో బద్ధవిరోధులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ- ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య మంగళవారం ఊహించనిరీతిలో ఆత్మీయతాభావం వెల్లివిరిసింది. మంగళవారం ఆప్ అధినేత కేజ్రీవాల్ పుట్టినరోజు కావడంతో ఆయనకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని తాను ప్రార్థించినట్టు మోదీ ట్విట్టర్ లో తెలిపారు. మోదీ బర్త్ డే విషెస్ తో మురిసిపోయిన కేజ్రీవాల్ ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేశారు.
మోదీ-కేజ్రీవాల్ రాజకీయంగా ఉప్పు-నిప్పులా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ తనను చంపించాలని చూస్తున్నారని ఆ మధ్య కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఢిల్లీ పాలన వ్యవహారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం- కేజ్రీవాల్ మధ్య నిత్యం ఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే మంగళవారం కేజ్రీవాల్ 48వ వసంతంలో అడుగుపెట్టడంతో మోదీ నుంచి ఆయనకు బర్త్ డే విషెస్ లభించాయి.
ట్విట్టర్ వేదికగా సాగిన ఈ పరస్పర ఆత్మీతాయానురాగం నెటిజన్లను గిలిగింతలు పెట్టినట్టుంది. ఈ విషయమై తమదైన రీతిలో వారు స్పందిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత స్నేహితులూ అంటూ ఎవరూ ఉండరని, పైకి నిత్యం తిట్టుకుంటూ ఉన్నా.. పుట్టినరోజు వంటి, వేడుకల్లో మనస్సులోని స్నేహాలు ఇలా చాటుకుంటారని ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యానం చేస్తున్నారు.