
డిపాజిట్లపై వడ్డీ తగ్గించిన పీఎన్‌బీ, యాక్సిస్ బ్యాంక్
ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) బుధవారం కొన్ని స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) బుధవారం కొన్ని స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. రుణ రేట్ల తగ్గింపునకు ఇది సంకేతంగా భావించవచ్చు. బ్యాంక్ తాజా డిపాజిట్ కోత నిర్ణయం జూన్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాలసీ రేటు పావు శాతం తగ్గించిన మరుసటి పీఎన్‌బీ డిపాజిట్ రేటు తగ్గించింది. పాలసీ నిర్ణయం వెలువడిన వెంటనే ఐడీబీఐ బ్యాంక్ డిపాజిట్ రేటు కోత నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, పంజాబ్ సింథ్ బ్యాంక్, దేనా బ్యాంక్‌లు రుణ రేట్లు తగ్గించాయి.
యాక్సిస్ ఇలా...
కాగా ప్రైవేటురంగంలో మూడవ అతిపెద్ద బ్యాంక్ యాక్సిస్ కూడా కొన్ని మెచ్యూరిటీలపై స్థిర డిపాజిట్ రేట్లను పావు శాతం తగ్గించింది. యాక్సిస్ బ్యాంక్ నిర్ణయం జూన్ 9 నుంచి అమల్లోకి వస్తుంది.