
ఏయ్ ఖాకీ పో వెనక్కి.. అంటూ వర్ల రామయ్య..
ఏయ్ ఖాకీ .. పో వెనక్కి, సభా వేదికపై నీ కేంపని అంటూ మాజీ పోలీసు అధికారి, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి: ఏయ్ ఖాకీ .. పో వెనక్కి, సభా వేదికపై నీ కేంపని అంటూ మాజీ పోలీసు అధికారి, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరుతో విధి నిర్వహణలో వున్న పోలీసులు అవాక్కయ్యారు. తిరుపతి ఇందిరా మైదానంలో నిన్న (బుధవారం) తుడా చైర్మన్‌గా నరసింహయాదవ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామయ్య తీరు సభికులను, పార్టీ కార్యకర్తలను సైతం ఆశ్చర్యపరిచింది. సభా వేదికలో కనిపించేందుకు పార్టీ కేడర్ ఎగబడటంతో కార్యకర్తల్లో క్రమశిక్షణ లేదంటూ మైక్ తీసుకున్న వర్ల రామయ్య తనదైన శైలిలో ఏకవచనంతో అందరిపైనా విరుచుకుపడ్డారు.
పోలీసులను, పార్టీ వారినీ, అధికారులను... ఇలా ఎవరినీ వదలలేదు. పార్టీ నేతలు పలువురు వేదికపై ఉండగా ఏయ్.. రేయ్ వేదిక దిగు... నీకేంపనిక్కడ వెళ్లు అంటూ మాట్లాడారు. కష్టపడి పనిచేసిన మమ్మల్ని ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి రేయ్ పోండని ఎలా మట్లాడతారని స్థానిక నాయకులు అసహనం వ్యక్తం చేశారు.
ప్రమాణ స్వీకారం చేయించేందుకు పత్రాలు తీసుకొచ్చిన తుడా అధికారులపైనా దురుసుగా వ్యవహరించారు. ఎవరు నువ్వు .. తుడా అధికారివా.. అయినా వెళ్లు పిలిచినప్పుడు రా.. పో అంటూ మాట్లాడటంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్ హోదాలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న వర్ల రామయ్య అకారణంగా విధి నిర్వహణలో ఉన్న తమనిలా మాట్లాడడం ఏమిటని పోలీసులు వాపోయారు.