మంత్రి గేదెలు...మంచి పోలీసులు!
‘కనబడుట లేదు’ అనే మాట వినిపించగానే... ఉత్తరప్రదేశ్‌లో పోలీసు యంత్రాంగమంతా ఏకమై కదిలింది... శిక్షణ పొందిన శునకాలతో చె ట్టూపుట్టా గాలించి చివరికి ఆచూకీ కనిపెట్టింది...ఇంతకీ వాళ్లు కనిపెట్టింది ఏంటో తెలుసా... గేదెలను... కాకపోతే అవి వీఐపీ గేదెలు... అందునా ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్‌కు చెందిన గేదెలు... గత శుక్రవారం ఆజంఖాన్ ఫాంహౌజ్ నుంచి ఏడు గేదెలు చోరీకి గురయ్యాయి. దీంతో తన గేదెలను పట్టుకురావాలని మంత్రి స్థానిక పోలీసులను ఆదేశించారు. అమాత్యుల మాటను శిరసావహించిన పోలీసులు గాలించి, శోధించి చివరికి మంత్రిగారి గేదెల ఆచూకీ తెలుసుకున్నారు. కాకపోతే.. గేదెలను కనిపెట్టడానికి సంబంధించి విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అక్కడి ప్రభుత్వం ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసింది.