పిజ్జా డ్రోన్లపై పోలీసుల కన్నెర్ర
వినియోగదారుల ఇళ్లకు పిజ్జాలు పంపడానికి డ్రోన్లు ఉపయోగించడంపై ముంబై పోలీసులు కన్నెర్ర చేశారు. ఇలాంటి ప్రయోగాలు చేసేముందు ముందుగా తమకు ఎందుకు తెలియజేయలేదని, అనుమతులు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి కూడా సదరు పిజ్జా హౌస్ వాళ్లు అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. ఫ్రాన్సెస్కోస్ పిజ్జెరియా అనే ఔట్లెట్ వాళ్లు ఇలా డ్రోన్ సాయంతో పిజ్జాలను డెలివరీ చేయడానికి ప్రయత్నించారు. (చదవండి: ముంబైలోనూ డ్రోన్ ద్వారా పిజ్జా డెలివరీ)
అయితే ఏ వస్తువునైనా గాల్లోకి ఎగరేయాలంటే అందుకు ముందుగా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఏటీసీ వర్గాలు చెబుతున్నాయి. రిమోట్ కంట్రోల్ సాయంతో ఎగరేసే ఇలాంటి వస్తువుల వల్ల భద్రతాపరమైన ముప్పు పొంచి ఉంటుందని, అందుకే ముందుగా అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. డ్రోన్ ప్రయోగానికి సంబంధించి తాము పూర్తి వివరాలు తీసుకుంటామని అదనపు పోలీసు కమిషనర్ మధుకర్ పాండే తెలిపారు. ఇప్పటికే ఒకసారి ముంబై నగరంపై ఉగ్రవాద దాడి జరిగినందున.. భవిష్యత్తులో ఉగ్రవాద సంస్థలు కూడా ఇలాంటి మానవరహిత వాహనాలను దాడులకు ఉపయోగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.