డెహ్రాడూన్: శీతాకాలం ప్రారంభమవడంతో కేదార్‌నాథ్, యమునోత్రి దేవాలయాలను మంగళవారం నుంచి మూసివేశారు. ఈ క్షేత్రాల వద్ద హిమపాతం పెరుగుతూ ఉండడం, భక్తులు చేరుకోవడం కష్టతరమైన పని కావడంతో ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని ఉదయం 8 గంటలకు, యమునోత్రిని మధ్యాహ్నం 1.15 గంట లకు మూసివేశారు. ఆలయంలో పూజ సందర్భంగా నాసిక్ నుంచి తీసుకువచ్చిన వంద కిలోల విభూదిని శివలింగానికి పూశారు. శీతాకాలం వచ్చేనాటికి మంచు ఎక్కువగా కురవడం, మార్గం లేకపోవడంతో ఆలయాన్ని మూసేశారు. శీతాకాలం ముగిసే వరకూ కేదార్‌నాథేశ్వరుడి ప్రతిమను ఉకిమఠ్ పట్టణంలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. చార్‌ధామ్ యాత్రలోని మరో పుణ్యక్షేత్రం గంగోత్రి సోమవారం మూతపడగా, మరో దేవాలయం బద్రీనాథ్‌ను ఈ నెల 18 నుంచి మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.