‘పీఆర్‌సీ’ బకాయిలపై సర్కారు ప్రాథమిక అంచనా
* పే ఫిక్సేషన్ ఆధారంగా వివరాల సేకరణ
* పే అండ్ అకౌంట్స్, ట్రెజరీల నుంచి సమాచారం కోరిన ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్‌సీ వేతన సవరణ ప్రకారం చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం లెక్కలేసుకుంటోంది. ఈ భారం దాదాపు రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల మధ్యలో ఉంటుందని ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసుకుంది. ఉద్యోగుల కొత్త పే ఫిక్సేషన్ ప్రకారం వారికి రావాల్సిన పీఆర్‌సీ బకాయిలు ఎంత...? మొత్తంగా తొమ్మిది నెలల బకాయిలకు ఎంత చెల్లించాల్సి ఉంది...?
అనే వివరాల సేకరణలో సర్కారు నిమగ్నమైంది. వెంటనే ఈ సమాచారం అందించాలని పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ కార్యాలయాలను కోరింది. మార్చి నెలలోనే పదో పీఆర్‌సీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కొత్త వేతన సవరణకు అనుగుణంగా వేతనాల స్థిరీకరణ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. పెరి గిన వేతనాలు అందుకుంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు సైతం పెరిగిన పింఛన్‌ను పొందుతున్నారు. ఈ మేరకు నెలసరి చెల్లింపుల వివరాలన్నీ పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ కార్యాలయాల్లో సిద్ధంగా ఉన్నాయి.
వీటి ఆధారంగా వారికి ఇవ్వాల్సిన బకాయిలకు ఎంత సొమ్ము కావాలనేది లెక్క తేలిపోతుంది. అందుకే పే అండ్ అకౌంట్స్, ట్రెజరీల నుంచి వచ్చే సమాచారంతో పీఆర్‌సీ బకాయిల ఫైలును సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించిం ది. పీఆర్‌సీ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2014 జూన్ నుంచి 2015 మార్చి వరకు బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ ఉత్తర్వులిచ్చే సమయంలోనే బకాయిలపై సర్కారు మల్లగుల్లాలు పడింది. బాండ్లు జారీ చేయటం.. లేదా నగదు చెల్లింపులు చేయటం.. జీపీఎఫ్ ఖాతాలో జమ చేయటం..
ఈ మూడు అంశాలను పరిశీలించింది. భారీ మొత్తం కావటంతో జీపీఎఫ్‌లో జమ చేస్తే... ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర రుణ పరిమితి తగ్గిపోతుంది. నగదు చెల్లింపులు చేయాలన్నా... విడతల వారీగా చెల్లించాలన్నా... ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు నిధుల్లో కోత పెట్టాల్సి వస్తుంది. మధ్యేమార్గంగా బాండ్లు జారీ చేసే దిశగా ఆలోచనలు చేసింది. ఈలోగా బాండ్ల జారీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటనలు జారీ చేశాయి.
దీంతో ప్రభుత్వం బకాయిల అంశాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని పీఆర్‌సీ జీవోల్లో ప్రస్తావించి తాత్కాలికంగా దాటవేసింది. ఈ జీవోలు వచ్చి అయిదు నెలలు కావస్తోంది. తాజాగా బకాయిలపై ఆర్థిక శాఖలో ఫైలుకు మళ్లీ కదలిక వచ్చింది. బకాయిలకు ఎంత మొత్తం అవసరమనేది నిక్కచ్చిగా తేలి తేనే... వాటిని ఎలా చెల్లించాలనేది నిర్ణయం తీసుకునే వీలుంటుందని అధికారులు తాజా కసరత్తు ప్రారంభించటం గమనార్హం.
కేబినెట్‌కు చేరిన డీఏ ఫైలు: ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు భత్యం (డీఏ) ఫైలును ఆర్థిక శాఖ కేబినెట్ ఆమోదానికి పంపించింది. 3.144 శాతం డీఏను ఖరారు చేసింది. తదుపరి జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాతే పెరిగిన డీఏ అమల్లోకి వస్తుంది.
తిరస్కరించిన సిఫారసులిక అంతే...
పదో పీఆర్‌సీ చేసిన సిఫారసులు కొన్నిం టిని ప్రభుత్వం పక్కన బెట్టింది. ఉద్యోగుల సర్వీసు వెయిటేజీ, పెన్షనర్లకు అదనపు పింఛన్ చెల్లింపు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్, చెవిటి ఉద్యోగులకు అలవెన్స్ అంశాలపై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి పెన్షన్ పొందేం దుకు రిటైర్‌మెంట్ నాటికి 33 ఏళ్ల సర్వీసు ఉండాలనే నిబంధన ఉంది.
గత పీఆర్‌సీ దీన్ని ఐదేళ్ల పాటు సడలించింది. దీన్ని 8 ఏళ్లకు పెంచాలని పదో పీఆర్‌సీ చేసిన సిఫారసులను ప్రభుత్వం తోసిపుచ్చింది. పెన్షనర్లకు వయస్సు పెరిగేకొద్ది అదనంగా చెల్లించే పెన్షన్ (అడిషనల్ క్వాంటమ్ పెన్షన్)ను 70 ఏళ్ల నుంచే అమలు చేయాలనే సిఫారసుకు హేతుబద్ధత లేదని తిరస్కరించింది. దీంతో ఇప్పుడున్న 70 ఏళ్ల విధానమే అమలవుతోంది.
రూ. 4 వేల కోట్లపైనే...
Published Fri, Aug 21 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM
Advertisement
Advertisement