నటి ప్రీతిజింటాపై దర్యాప్తు వేగవంతం!
ముంబై: మాజీ ప్రియుడు నెస్ వాడియాపై బాలీవుడ్ నటి ప్రీతిజింటా పెట్టిన వేధింపుల కేసులో దర్యాప్తు వేగవంతం కానుంది. ముంబై పోలీసులు సోమ లేదా మంగళవారాల్లో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఈ నెల 12న వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ప్రీతిజింటా అమెరికాకు వెళ్లింది. ఆ పర్యటన ముగించుకుని ఆదివారం ఆమె ముంబైకి తిరిగొచ్చింది. దీంతో ఈ కేసులో ప్రీతిజింటా అనుబంధ వాంగ్మూలాన్ని సోమ లేదా మంగళవారాల్లో నమోదు చేయనున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. మే 30న వాంఖడే స్టేడియంలో కింగ్స్-11 పంజాబ్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతిజింటా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే, ఈ సంఘటన కచ్చితంగా ఏ ప్రదేశంలో జరిగింది? ఆ సమయంలో చుట్టూ ఎవరున్నారు? అనే విషయాలను ఆమె నుంచి తెలుసుకోవాలని అనకుంటున్నట్లు ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్ రవీంద్ర షిశ్వే తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా మ్యాచ్ జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టిన అనంతరం నెస్‌వాడియాను ప్రశ్నించనున్నట్లు షిశ్వే చెప్పారు. ఈ కేసులో ఐపీఎల్ సీవోవో సుందర్‌రామన్, బీసీసీఐ సెక్రటరీ సంజయ్‌పటేల్ సహా ఏడుగురు సాక్ష్యుల వాంగ్మూలాలను పోలీసులు ఇప్పటికే నమోదు చేశారు. మరోవైపు నెస్‌వాడియా తండ్రి నుస్లి వాడియా కార్యదర్శికి వచ్చిన బెదిరింపు కాల్స్‌పై కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.