బ్లాక్‌బెర్రీని కొనేది హైదరాబాదీనే! | Prem Watsa, Canada's Warren Buffett, who wants to buy BlackBerry | Sakshi
Sakshi News home page

బ్లాక్‌బెర్రీని కొనేది హైదరాబాదీనే!

Published Wed, Sep 25 2013 12:46 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

బ్లాక్‌బెర్రీని కొనేది హైదరాబాదీనే! - Sakshi

బ్లాక్‌బెర్రీని కొనేది హైదరాబాదీనే!

నష్టాలతో కుదేలవుతున్న కెనడా హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీకి మన హైదరాబాద్‌తో అనుబంధం ఏర్పడనుంది. ఎందుకంటే.. దీన్ని దాదాపు రూ. 30 వేల కోట్లతో కొనుగోలు చేయబోతున్న మరో కెనడియన్ కంపెనీ ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థ చైర్మన్, సీఈవో ప్రేమ్ వత్స మన హైదరాబాద్ వాడే.  కెనడా వారెన్ బఫెట్‌గా కూడా ఆయన పేరొందారు. అచ్చం ‘ఇన్వెస్ట్‌మెంట్ గురు’ వారెన్ బఫెట్ తరహాలోనే పెట్టుబడి విధానాలను అనుసరించడమే ఇందుకు కారణం. బఫెట్‌లాగానే వత్స కూడా అందరూ ఆశలు వదులుకున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు.
 
 భాగ్యనగరం మూలాలు..
 1950లో ఇక్కడ జన్మించిన వత్స..విద్యాభ్యాసం బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జరిగింది. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత కెనడాకి వెళ్లి అక్కడి యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఒంటారియోలో ఎంబీయే చేశారు. చాలా సాదాసీదాగా ఉండే వత్స గురించి.. 1985లో ఫెయిర్‌ఫాక్స్‌ని ప్రారంభించే దాకా ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ తర్వాత కూడా 15 ఏళ్ల పాటు ఆయన విలేకరులతో పెద్దగా మాట్లాడలేదు. 2001 నుంచి మాత్రమే కాస్త ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ కాల్స్ మొదలైన  వాటిల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. సంపన్నుడైనప్పటికీ.. మిగతా బిలియనీర్లతో పోలిస్తే వత్స తన కంపెనీ నుంచి తక్కువ జీతభత్యాలు అందుకుంటారు. గతేడాది కెనడాలో అత్యధికంగా ఆర్జించిన వారి సంఖ్యలో ఆయన 102వ స్థానంలో ఉన్నారు. 2012లో ఆయన తీసుకున్న జీతభత్యాలు 6,22,000 డాలర్లు. ఫెయిర్‌ఫాక్స్‌లో ఆయనకు సుమారు 10శాతం వాటాలు ఉన్నాయి. వత్స ప్రస్తుతం రిచర్డ్ ఐవీ స్కూల్ ఆఫ్ బిజినెస్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడు. అలాగే, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూకి చాన్స్‌లర్‌గానూ వ్యవహరిస్తున్నారు.
 
 సంక్షోభం ముందుగానే ఊహించారు..
 తనఖా రుణాలతో ముడిపడిన అమెరికన్ బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోతాయని ముందుగానే అంచనా వేసిన ఘనత వత్సది. అలాగే, కెనడాలో కూడా హౌసింగ్ మార్కెట్ విలువ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉందని కూడా ఆయనే వెల్లడించారు. అందరూ వీటిని కొట్టిపారేసి హౌసింగ్ మార్కెట్‌లలో విపరీతమైన లాభాలు ఆర్జిస్తున్నప్పుడు 2003-2006 మధ్యలో ఫెయిర్‌ఫాక్స్ స్టాక్ విలువ 50 శాతం పైగా పడిపోయింది. కానీ ఆ తర్వాత 2007 నుంచి మిగతా ఇన్వెస్టర్లు నష్టాల్లో కూరుకుపోతున్నప్పుడు ఫెయిర్‌ఫాక్స్ బిలియన్ డాలర్ల స్థాయిలో లాభాలు ఆర్జించింది. ఆ నిధులను వత్స క్రమంగా ఈక్విటీల్లోకి మళ్లించారు. 2006లో కనిష్టమైన 100 కెనడియన్ డాలర్ల స్థాయికి పడిపోయిన ఫెయిర్‌ఫాక్స్ షేర్లు ప్రస్తుతం నాలుగింతలు పెరిగాయి.
 
 ఇన్వెస్ట్‌మెంట్ చాణక్యుడు..
 బఫెట్ తరహాలోనే వత్స ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాలు ప్రారంభంలో అంతుబట్టవు. ఆయన వ్యూహాలన్నీ దీర్ఘకాలికమైనవిగా ఉంటాయని పరిశీలకులు చెబుతారు. 1990లో టోక్యో మార్కెట్ కుప్పకూలడానికి చాలా ముందుగానే పరిస్థితులను పసిగట్టి వత్స .. వాటికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు ఆర్జించారు. ఇక, బ్లాక్‌బెర్రీ షేరు అంతకంతకూ పతనమవుతున్నప్పటికీ.. గత ఏడాదిన్నర కాలంగా ఫెయిర్‌ఫాక్స్.. ఆ కంపెనీలో వాటాను 2% నుంచి 10%కి పెంచుకుంది.
 
 బ్లాక్‌బెర్రీలో మూడో అతి పెద్ద ఇన్వెస్టరు ఫెయిర్‌ఫాక్సే. బ్లాక్‌బెర్రీలో వత్స బోర్డు డెరైక్టరుగా కూడా ఉండేవారు. అయితే, దాన్ని టేకోవర్ చేసే యోచన కారణంగా ఇటీవలే వైదొలగారు. మరోవైపు, అన్యాయం జరిగిందనిపిస్తే ప్రత్యర్థులపై గట్టి పోరాటాలు కూడా చేసేలా ఫెయిర్‌ఫాక్స్‌ని వత్స తీర్చిదిద్దారు. కంపెనీ షేర్లు కావాలనే పతనమయ్యేలా కుట్రపన్నాయంటూ పలు హెడ్జ్‌ఫండ్స్‌పై 2006లో ఏకంగా 6 బిలియన్ డాలర్ల పరిహారానికి ఫెయిర్‌ఫాక్స్ దావా వేసింది. అయితే, వత్స ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాల్లో కొన్ని బెడిసికొట్టినవీ ఉన్నాయి. ఫెయిర్‌ఫాక్స్ ఇన్వెస్ట్ చేసిన క్యాన్‌వెస్ట్ అనే మీడియా సంస్థ 2009లో దివాలా తీసింది. దీంతో ఆ పెట్టుబడికి నీళ్లొదులుకుంది. టార్‌స్టార్ అనే పబ్లిషింగ్ సంస్థలో చేసిన పెట్టుబడులూ పోగొట్టుకోవాల్సి వచ్చింది.
 
 భారత సంస్థలతోనూ జట్టు..
 
 వత్స సారథ్యంలోని ఫెయిర్‌ఫ్యాక్స్ ఇటు భారత కంపెనీలతో కూడా జట్టు కట్టింది. 1999లో ఐసీఐసీఐ బ్యాంక్, ఫెయిర్‌ఫాక్స్ కలిసి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థను ఏర్పాటు చేశాయి. ఫెయిర్‌ఫాక్స్ గతేడాది బ్రిటన్ కంపెనీ థామస్ కుక్ భారత విభాగంలో 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ థామస్ కుక్ ఇండియా ఈ ఏడాది మేలో ఐక్య హ్యూమన్ క్యాపిటల్ సొల్యూషన్స్ అనే సంస్థలో 77.3 శాతం వాటాలను సుమారు రూ. 256 కోట్లకు కొనుగోలు చేసింది.


 పలు భారీ డీల్స్..: గతేడాది అక్టోబర్‌లో ఫెయిర్‌ఫాక్స్.. లండన్‌కి చెందిన బ్రిట్ ఇన్సూరెన్స్‌ని 300 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. 2010లో జెనిత్ నేషనల్ ఇన్సూరెన్స్‌ని 1.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement