క్రియాశీలకంగా పనిచేయండి
స్వచ్ఛభారత్ ప్రచారకర్తలకు రాష్ట్రపతి పిలుపు
* స్వచ్ఛభారత్ గీతావిష్కరణ.. ప్రచారకర్తలకు సత్కారం
* సత్కార గ్రహీతల్లో తొమ్మిది మంది తెలుగువారు
సాక్షి, న్యూఢిల్లీ: పారిశుద్ధ్యం పనులను దత్తత తీసుకునేలా ప్రజలను ప్రభావితం చేయాలని స్వచ్ఛభారత్ ప్రచారకర్తలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కోరారు. ప్రతి పట్టణం శుభ్రం అయ్యేంతవరకు ప్రచారకర్తలు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆయన రాష్ట్రపతి భవన్‌లో స్వచ్ఛభారత్‌పై జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు.
ఈ సందర్భంగా స్వచ్ఛభారత్‌పై ప్రఖ్యాత సినీగేయ రచయిత ప్రసూన్ జోషి రచించిన గేయాన్ని ఆయన విడుదల చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతమవడానికి ప్రచారకర్తలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. ‘స్వచ్ఛభారత్’గా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న ప్రచారకర్తలుగా ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం సత్కరించారు.
సత్కారం పొందిన వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుద్దాల అశోక్ తేజ(సినీగేయ రచయిత),జీఎస్ రావు (యశోదా హాస్పిటల్స్) అక్కినేని అమల (బ్లూక్రాస్ చైర్‌పర్సన్), రామోజీరావు (ఈనాడు గ్రూప్), టి.నరేంద్రనాథ్ చౌదరి (ఎన్టీవీ), డాక్టర్ జె.రామేశ్వరరావు (మై హోంగ్రూప్), జె.ఎ.చౌదరి (టాలెంట్ స్ప్రింట్), సి.ఎం.దేవరాజరెడ్డి (ఉపాధ్యక్షులు, ఐసీఏఐ), మంచు లక్ష్మి (సినీనటి) ఉన్నారు. సత్కారం పొందిన వారిలో ప్రముఖులు: యూపీ సీఎం అఖిలేశ్, సచిన్, కమల్‌హాసన్, శంకర్ మహాదేవన్, సురేష్ రైనా, బి.డి.లీసారామ్, అనిల్ అంబానీ, స్వామి రాందేవ్, ప్రనవ్ పాండే, బ్రహ్మకుమారి పుష్పా.