
విపక్షాల అభ్యర్థిగా అంబేడ్కర్ మనవడు!
- విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకాశ్ అంబేద్కర్!
- సీపీఎం సూచన.. రేపటి 18 పార్టీల భేటీలో తుది నిర్ణయం
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో దళితుడైన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు పోటీగా దళిత నేతనే బరిలోకి దించేందుకు వామపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మనవడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేడ్కర్‌ను పోటీగా నిలబెట్టాలని యోచిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్, ఎన్డీఏయేతర పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సీపీఎం నేత సీతారాం ఏచూరి వాటితో అనధికారిక సంప్రదింపులు జరుపుతున్నారని లెఫ్ట్ వర్గాలు చెప్పాయి. ‘కాంగ్రెస్, ఇతర పార్టీలు అంగీకరిస్తే ప్రకాశ్ అంబేడ్కర్‌ను పోటీలో నిలబెడతాం’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేకపోయినా విపక్షం అభ్యర్థిని నిలబెట్టాలనే పట్టుదలతో లెఫ్ట్ పార్టీలు ఉన్నాయని వెల్లడించాయి. ‘ఇది రాజకీయ పోటీ కానుంది. అయితే మేం గెలుస్తామని అనుకోవడం లేదు’ అని లెఫ్ట్ అగ్రనేత ఒకరు చెప్పారు. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ చీఫ్ సోనియా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఏచూరి తదితర 18 విపక్షాల నేతలు గురువారం సమావేశం కానున్నారు.