
లిక్కర్ మాఫియాను అడ్డుకోగలమా?
ఆందోళన చెందుతున్న ఎక్సైజ్ ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో గుడుంబాను అరికట్టడం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన పాలసీపై ఆబ్కారీ శాఖ తీవ్ర మదనపడుతోంది. నూతన పాలసీ ప్రకారం మండలం ఒక యూనిట్‌గా ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న జిల్లా స్థాయి మద్యం పాలసీకే లిక్కర్ మాఫియా అరాచకాలు సృష్టిస్తున్న నేపథ్యంలో మండలం యూనిట్‌గా అమలు చేస్తే వారి ఆగడాలకు అడ్డూ అదుపూ ఉండదేమోనని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది.
అంతేకాదు లిక్కర్ మాఫియా పూర్తి గుత్తాధిపత్యంతో మరింత బలపడే ప్రమాదం ఉందంటున్నారు. రాజకీయ నాయకులను, అధికారులను తమ వైపు తిప్పుకొని ధరలను ఇష్టారీతిన పెంచే ప్రమాదం లేకపోలేదని పేర్కొంటున్నారు. అదే విధంగా గ్రామాల్లో కల్తీ మద్యం ఏరులై పారినా అదుపు చేసే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. మొత్తం మీద ఈ విధానం వల్ల ఎక్సైజ్‌శాఖ మరింత అభాసు పాలయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
పాతరోజులు వస్తాయేమో..!
ఎన్టీఆర్ హయాంలో ‘వారుని-వాహిని’ ద్వారా సారా అమ్మకాలను సొంతం చేసుకున్న వ్యక్తులు గ్రామాల్లో వారి ఏజెంట్లను నియమించుకొని అమ్మకాలు సాగించేవారు. అయితే అక్రమ సారా సరఫరా అవుతుందంటూ సదరు వ్యక్తుల తాలుకు మనుషులు ‘ప్రైవేట్ సైన్యం’గా ఏర్పడి గ్రామాలతో పాటు తండాలలో విధ్వంసం సృష్టించారు. మళ్లీ అలాంటి ముప్పు వాటిల్లుతుందేమోనని ఆబ్కారీ శాఖ అందోళన చెందుతోంది.