
ఖైదీల మసాజ్ సెంటర్ ప్రారంభం
రాష్ట్ర జైళ్లశాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడ జైలు వద్ద ప్రకృతి చికిత్సాలయ తరహాలో ఏర్పాటుచేసిన మసాజ్ సెంటర్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ ప్రారంభించారు.
జైళ్లశాఖ సంస్కరణలను అభినందించిన డీజీ అనురాగ్‌శర్మ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడ జైలు వద్ద ప్రకృతి చికిత్సాలయ తరహాలో ఏర్పాటుచేసిన మసాజ్ సెంటర్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ ప్రారంభించారు. ఖైదీలకు ప్రత్యేక శిక్షణనిచ్చి, వారిచేత కేరళ మాదిరిగా ప్రకృతి చికిత్సలందజేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా ఖైదీల ములాఖత్ కోసం వచ్చే సందర్శకులు వేచి ఉండటం కోసం ఏర్పాటు చేసిన విజిటర్స్‌లాంజ్‌ను కూడా డీజీపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ములాఖత్ విషయంలో జైళ్లశాఖ అవలంభిస్తున్న నూతన పద్ధతిని పరిశీలించారు. ములాఖత్‌కు వచ్చే వారికి ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ప్రతీ ఒక్కరి పూర్తి వివరాల సేకరణ, ప్రత్యేక వెబ్ కెమెరా ద్వారా ఫోటో తీసే విధానం పట్ల డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. జైళ్లశాఖ ఖైదీలకు కల్పిస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. చంచల్‌గూడ వద్ద నిర్వహిస్తున్న పెట్రోల్‌బంక్‌ను పరిశీలించారు. జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ నూతన సంస్కరణల ద్వారా సమకూర్చుకుంటున్న వైనం, సిబ్బంది పనితీరును అనురాగ్‌శర్మ ప్రత్యేకంగా అభినందించారు.