ట్రంప్‌పై అమెరికా ఆక్టోపస్ పక్కా జోస్యం!
నవంబర్ 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పగలరా? హోరాహోరీగా తలపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరు గెలుస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కానీ ఒక్క వ్యక్తి మాత్రం అగ్రరాజ్య ఎన్నికల ఫలితం తనకు తెలుసు అని అంటున్నాడు.
ఆయనే ప్రొఫెసర్ అలాన్ లిచట్మన్. గత 30 ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆయన వేసిన అంచనా ఎన్నడూ తప్పుకాలేదు. 1984 ఎన్నికల నుంచి ఎవరు అమెరికా అధ్యక్షుడిగా గెలుస్తారో ఆయన కచ్చితంగా అంచనా వేస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మొగ్గు ఉందని సర్వేలు చెప్తున్నా.. అలాన్ మాత్రం ట్రంప్‌పే గెలిచే అవకాశముందని అంచనా వేస్తున్నాడు. లిచట్మన్ ఏదో ఆషామాషీగా అంచనా వేసి ఈ ఫలితాలను ప్రకటించలేదు.
రాజకీయ అభిప్రాయాలు, ప్రాంతీయ ప్రజల మనోభావాలను అంచనా వేసి ఆయన ఈ నిర్ధారణకు వచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే గెలిచే అవకాశముందని ఆయన చెప్ప్తున్నారు. ఈ మేరకు ట్రంప్ ఎందుకు గెలిచే అవకాశముందో వివరిస్తూ 'ప్రిడిక్టింగ్ ద నెక్ట్స్ ప్రెసిడెంట్: ద కీస్ టు వైట్‌హౌస్ 2016' పుస్తకాన్ని ప్రచురించారు. పార్టీ మ్యాండెట్, ప్రభుత్వ వ్యతిరేకత, ఆర్థిక విధానాలు, సామాజిక అనిశ్చితి, విదేశాంగ, సైనిక విధానాలు ఇలాంటి చాలా అంశాలను బేరీజు వేసి ఈసారి ఆయన ట్రంప్‌కు ఓటువేశారు. మరీ ఈసారి ఎన్నికల్లో ఈ అమెరికా ఆక్టోపస్ జోస్యం నిజమవుతుందా? చూడాలి.