
బెస్ట్ టెస్టు బ్యాట్స్‌మన్ అతనే: కోహ్లి
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా ఆడి సెంచరీ చేసిన ఛటేశ్వర్ పూజారాపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఉత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లో పూజారా ఒకరు. అతని పరుగుల దాహం, అతని మానసిక సామర్థ్యం అతన్ని గొప్ప బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టాయి' అని కితాబిచ్చాడు.
రెండో టెస్టులో 133 పరుగులు చేసిన పూజారా.. మరో బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే (132)తో కలిసి 217 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 622/9 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. శ్రీలంకను మొదటి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌట్ చేసి.. ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ 'ముఖ్యంగా మిడిలార్డర్‌లో మా జట్టులో ఇద్దరు ఉత్తమ టెస్ట్ ఆటగాళ్లు పూజారా, రహానే. వారు చాలా నిలకడగా ఆడుతున్నారు. నేను పూజారాకే ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. టీమిండియా తరఫున కేవలం ఒక ఫార్మెట్‌లోనే అతను ఆడుతున్నాడు. అయినా, ఎంతో పరుగుల దాహంతో ప్రతిసారి రాణిస్తున్నాడు. ఎంతో అకుంఠిత దీక్ష, మానసిక సామర్థ్యం ఉంటే తప్ప ఇలా నిలకడగా రాణించడం సాధ్యం కాదు' అని కోహ్లి అన్నాడు.