ICC ODI WC 2023- Kohli 78th Century: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023.. బంగ్లాదేశ్‌తో పుణెలో మ్యాచ్.. లక్ష్య ఛేదనలో టీమిండియా జోరు చూస్తే గెలుపుపై ఎలాంటి సందేహాలు లేవు. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి సెంచరీ సెంచరీలకు మరో ముందడుగు పడే అవకాశం..
ఛేజింగ్‌లో 36 ఓవర్ల తర్వాత జట్టు విజయానికి 48 పరుగులు కావాల్సి ఉండగా... కోహ్లి అప్పటికి 68 పరుగుల వద్ద ఉన్నాడు. తర్వాతి ఓవర్లో కేఎల్ రాహుల్ 6, 4 సహా 12 పరుగులు చేయడంతో ఈ అంతరం మరింత తగ్గింది.
మరుసటి ఓవర్ తర్వాత టీమిండియా గెలవాలంటే 28 పరుగులు, కోహ్లి సెంచరీకి 27 పరుగులు కావాలి. ఇద్దరు ప్రధాన బ్యాటర్లు క్రీజ్‌లో ఉంటే ఒక్కడే పరుగులు చేయడం దాదాపుగా జరగదు. కానీ తగినన్ని ఓవర్లు అందుబాటులో ఉండటంతో సమస్య లేదు కాబట్టి ఈ దశలో కోహ్లి శతకం పూర్తి చేసుకోవడంపై దృష్టి సారించాడు.
అతడి ఆలోచనకు తగ్గట్లుగా రాహుల్ కూడా పరుగులు చేయకుండా వెనక్కి తగ్గాడు. సింగిల్స్ తీసే అవకాశమున్నా కోహ్లి- రాహుల్ పరస్పర సమన్వయంతో ముందుకు సాగారు. ఫలితంగా కోహ్లి అంతర్జాతీయ కెరీర్‌లో 78వ శతకం సాధ్యమైంది.
తర్వాతి 32 పరుగుల్లో కోహ్లి ఒక్కడే 30 పరుగులు సాధించగా రాహుల్ సింగిల్ మాత్రమే తీశాడు. మరో పరుగు వైడ్ రూపంలో వచ్చింది. నసుమ్ వేసిన ఫుల్‌టాస్ బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది విరాట్ కోహ్లి శతక(103- నాటౌట్) గర్జన చేశాడు.
ఫ్యాన్స్ సంబరాలు.. మరోవైపు విమర్శలు
దీంతో కింగ్ కోహ్లి అభిమానులతో పాటు.. క్రికెట్ ప్రేమికులంతా సంబరాల్లో మునిగిపోయారు. అయితే, రాహుల్ కోహ్లికి సహకరించిన తీరు, వైడ్ విషయంలో అంపైర్ వ్యవహరించిన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవయ్యాయి. కోహ్లి స్వార్థంగా వ్యవహరించాడని కొందరు.. అంపైర్ కావాలనే టీమిండియా బ్యాటర్‌కు సహకరించాడని మరి కొందరు విమర్శలు గుప్పించారు.
కోహ్లి సెంచరీ చేసిన తీరును తప్పుబట్టిన పుజారా
ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు, వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా భిన్నంగా స్పందించాడు. వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించే కంటే.. జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయాలంటూ కోహ్లి తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు.
ఈ మేరకు.. ‘‘విరాట్ కోహ్లి శతకం సాధించాలని నేనెంతగా కోరుకున్నానో.. వీలైనంత త్వరగా లక్ష్యాన్ని ఛేదించాలని కూడా అంతగా కోరుకున్నాను. ఎందుకంటే.. ఇలాంటి మెగా టోర్నీల్లో నెట్ రన్‌రేటు ఎంతో కీలకం.
జట్టు గురించి కూడా ఆలోచించాలి.. త్యాగం చేయాలి
అగ్రస్థానంలో నిలవాలంటే... నెట్ రన్‌రేటు కోసం మనం పోరాడాల్సిన స్థితిలో ఉన్నాం. అలాంటపుడు జట్టు గురించే మనం మొదట ఆలోచించాలి. పరస్పర అవగాహనతోనే ఇలా జరిగి ఉండొచ్చు.
అయితే, ఒక్కోసారి జట్టు కోసం మనం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టుకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. మన కెరీర్‌లో ఓ మైలురాయిని అందుకునేందుకు జట్టు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రాకూడదు.
మైండ్‌సెట్‌ను బట్టే
ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలన్న హక్కు ఆటగాడిగా మనకు ఉంటుంది. అయితే, కొంతమంది తాము ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే తదుపరి మ్యాచ్‌కు ఉపయోగపడుతుందని భావిస్తారు.
ఇదంతా కేవలం ఆటగాడి మైండ్‌సెట్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో షోలో ఛతేశ్వర్ పుజారా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తనకైతే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ కంటే నెట్ రన్‌రేటు పెంచుకోవడమే ముఖ్యమైనదిగా అనిపించిందని పేర్కొన్నాడు.
ఆటగాళ్ల మైలురాళ్ల కోసం చూస్తే ఒక్కోసారి జట్టు నష్టపోవాల్సి వస్తుందని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లిని ఉద్దేశించి పుజారా చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కింగ్ కోహ్లి ఫ్యాన్స్ అయితే.. ‘‘జట్టు ప్రయోజనాల గురించి విరాట్‌కు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు’’ అంటూ పుజ్జీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బంగ్లాదేశ్‌పై విజయంతో వరల్డ్‌కప్-2023లో టీమిండియా వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసినప్పటికీ.. న్యూజిలాండ్(4 విజయాలు) కంటే రన్‌రేటు పరంగా వెనుకబడటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది.
చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment