ICC CWC 2023 Final- Rohit Sharma: టీమిండియా ఈసారి కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందనే అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. సొంతగడ్డపై 2011 నాటి ఫలితం పునరావృతమవుతుందనుకుంటే తీవ్ర నిరాశే మిగిలింది. తుదిపోరుకు ముందు దాకా అజేయంగా ముందుకు సాగిన రోహిత్ సేన అసలు మ్యాచ్‌లో తడబడి భారీ మూల్యమే చెల్లించింది.
ఆఖరి మెట్టుపై ఆస్ట్రేలియా ఒత్తిడిని చిత్తు చేసి ట్రోఫీ గెలవగా.. భారత జట్టుతో పాటు అభిమానుల గుండెలు ముక్కలయ్యాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దూకుడుగా ఆడిన రోహిత్
అహ్మదాబాద్ వేదికగా ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. ఓపెనర్ రోహిత్ శర్మ ఆది నుంచే దూకుడుగా ఆడి అద్భుత ఆరంభం అందించాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(4) విఫలమైనా వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(54)తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.
వీరిద్దరు క్రీజులో కుదురుకుంటే మెరుగైన భాగస్వామ్యంతో భారీ స్కోరుకు పునాది పడేది. కానీ రోహిత్ శర్మ అనూహ్య రీతిలో అవుట్ కావడం కొంపముంచింది. టీమిండియా ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో ఆసీస్ స్పిన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌కు వచ్చాడు.
హెడ్ అద్భుత క్యాచ్‌తో హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌కు తెర
అతడి బౌలింగ్‌లో రెండో బంతికి సిక్స్ కొట్టిన రోహిత్.. మరుసటి బంతికి ఫోర్ బాదాడు. కానీ మరోసారి భారీ షాట్‌కు యత్నించి మూల్యం చెల్లించాడు. మాక్సీ విసిరిన బంతిని మిడాన్ దిశగా రోహిత్ గాల్లోకి లేపగా.. కవర్ పాయింట్‌లో ఉన్న ట్రవిస్ హెడ్ పాదరసంలా వెనక్కి కదిలి అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మాక్సీ, ఆసీస్ కెప్టెన్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోగా.. మోదీ స్టేడియంలో ఉన్న అభిమానులు ఒక్కసారిగా మూగబోయారు.
అలా హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్.. తొందరపడి తప్పుడు షాట్ సెలక్షన్‌తో 47 పరుగుల వద్ద నిష్క్రమించాడు. మిగతా వాళ్లలో కోహ్లి 54, రాహుల్ 66 పరుగులతో రాణించగా.. 240 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమిపాలైంది.
చెత్త షాట్ సెలక్షన్
ఈ నేపథ్యంలో సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో రోహిత్ నిరాశ చెందాడో లేదో కానీ మేనేజ్‌మెంట్ మాత్రం కచ్చితంగా డిస్సప్పాయింట్ అయి ఉంటుంది. వరుస బంతుల్లో సిక్‌స, ఫోర్ బాదిన తర్వాత కూడా ఇలాంటి షాట్లు ఎంపిక చేసుకోవద్దని శిక్షణా సిబ్బంది అతడికి చెప్పండి.
పవర్ ప్లే ముగస్తుంది కాబట్టి మాక్స్‌వెల్ బౌలింగ్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని రోహిత్ భావించి ఉంటాడు. ఏదేమైనా.. నిజంగా అది చెత్త షాట్ సెలక్షన్. ఒకవేళ రోహిత్ గనుక అలా చేయకపోయి ఉంటే కథ వేరుగా ఉండేది’’ అని విమర్శించాడు.
చదవండి: CWC 2023 Final: మిచెల్ మార్ష్ అనుచిత ప్రవర్తన.. !
Comments
Please login to add a commentAdd a comment