న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం 42%పైగా క్షీణించి రూ. 755 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2012-13) క్యూ3లో రూ. 1,306 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొండి బకాయిలకు కేటాయింపులు, పన్ను చెల్లింపులు వంటివి పెరగడంతో లాభాలపై ప్రతికూల ప్రభావం పడిందని బ్యాంక్ చైర్మన్ కేఆర్ కామత్ చెప్పారు.
మొండిబకాయిల కేటాయింపులు రూ. 466 కోట్ల నుంచి రూ. 1,083 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు. నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.56% నుంచి 2.8%కు పెరిగినట్లు తెలిపారు. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 13% ఎగసి రూ. 4,221 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 3.57%గా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.11,499 కోట్ల నుంచి రూ.11,922 కోట్లకు స్వల్పంగా పెరిగింది. వాటాదారులకు షేరుకి రూ.10 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంపుపై స్పందిస్తూ రుణాలకు డిమాండ్ పుంజుకుంటే అటు డిపాజిట్లు, ఇటు రుణాలపై వడ్డీ రేట్లు పెంచే అవకాశముంటుందని చెప్పారు.
ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో 6% జంప్‌చేసి రూ. 549 వద్ద ముగిసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుత్సాహకర ఫలితాలు
Published Sat, Feb 1 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement