అమేథీ (యూపీ): కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన నియోజకవర్గానికి రెండు రైళ్లు, ఓ రైల్వే లైనును బహుమతులుగా ఇచ్చారు. అరుుతే ఇలాంటి చర్యలు పేదలను దారిద్య్రం నుంచి గట్టెక్కించజాలవని ఆయన చెప్పారు. అమేథీలోని సలోన్ ప్రాంతంలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రెండు రైళ్లను రాహుల్ ప్రారంభించారు. అలాగే ఓ కొత్త రైల్వే లైనుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవలం రైల్వే లైన్ల ఏర్పాటు, విమానాశ్రయూల నిర్మాణంతో పేదలు దారిద్య్రం నుంచి బయటపడలేరని తానెన్నోసార్లు చెప్పానని అన్నారు.
ఇందుకోసం తాము తొలుత ఉపాధి హామీ పథకాన్ని.. తాజాగా ఆహార భద్రతా పథకాన్ని తెచ్చామని చెప్పారు. ఆహార భద్రతా పథకం ఓ విప్లవాత్మకమైన అడుగుగా ఆయన పేర్కొన్నారు. ఎక్కువ సబ్సిడీ రేట్లతో పేదలు ప్రతినెలా ఆహారధాన్యాలు పొందుతారని తెలిపారు. ఈ అడుగు దేశ ముఖచిత్రాన్నే మార్చివేస్తుందని అన్నారు. వేలాది ఏళ్లుగా ప్రజలు ఆకలితోనే నిద్రపోయేవారని.. ఇప్పుడు మాత్రం అలా జరగదని చెప్పారు. గతంలో ‘మేము సగం రొట్టే తింటాం’ అనే నినాదం ఉండేదని, ఇప్పుడది ‘మొత్తం రొట్టె తిందాం’గా మారిందని రాహుల్ అన్నారు.