
మేము జీరో.. మీరు హీరో!
కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదని కాంగ్రెస్ మండిపడింది.
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదని కాంగ్రెస్ మండిపడింది. ఆ బడ్జెట్ ను గత యూపీఏ ప్రభుత్వం నుంచి కాపీ చేసి మాత్రమే ప్రవేశపెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. ఈ రోజు రాజ్యసభలో రైల్వే బడ్జెట్ పై ప్రసంగించిన ఆజాద్.. ఆ పాత బడ్జెట్ నే తాజాగా మూటగట్టి తిరిగి పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారని ఎద్దేవా చేశారు. ఇదేనా 'యూపీఏ జీరో.. ఎన్డీఏ హీరో' అని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
రాష్ట్రాలను పాలించిన అనుభవం ఉన్నా దేశంలో సమాఖ్య వ్యవస్థను సవ్యంగా నడపాలంటే అది ఏమాత్రం సులభ సాధ్యమైన అంశం కాదని నరేంద్ర మోడీని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల ఆచరణలో పెట్టడం సాధ్యం కాదని ఆజాద్ తెలిపారు. గత యూపీఏ పాలనలో ప్రభుత్వ పనితీరును వెనుకేసుకొచ్చిన ఆజాద్.. దేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పది సంవత్సరాలు పాటు పాలించినా యూపీఏ సాధించిన ప్రగతిని చేరుకోలేదన్నారు.