
'2.0'లో రజనీ రోల్స్‌పై మోస్ట్ క్రేజీ న్యూస్!
త్వరలో రాబోతున్న రజనీకాంత్ తాజా సినిమా 'రోబో 2.0' గురించి పలు ఆసక్తికరమైన ఊహాగానాలు, కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి.
త్వరలో రాబోతున్న రజనీకాంత్ తాజా సినిమా 'రోబో 2.0' గురించి పలు ఆసక్తికరమైన ఊహాగానాలు, కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సైటింఫిక్ థ్రిల్లర్‌లో రజనీ ఐదు విభిన్నమైన పాత్రలు పోషించబోతున్నాడట. అందులో రెండు పొట్టివాడి పాత్రలు కూడా ఉన్నాయట. ఇదే కనుక నిజమైతే తన నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తొలిసారి రజనీ ఈ చిత్రంలో పొట్టివాడి పాత్ర పోషించినట్టు అవుతుంది. మొదటి పార్టు 'రోబో' తరహాలోనే ఈ సినిమాలోనూ డాక్టర్ వశీకరణ్, చిట్టి (రోబో) పాత్రలు ఉంటాయి. దీనికి అదనంగా ఇద్దరు పొట్టివాళ్ల పాత్రల్లోనూ, విలన్ పాత్రలోనూ రజనీ కనిపిస్తాడని సినీ వర్గాల టాక్. 2010లో వచ్చిన 'రోబో'లోనూ చిట్టి పాత్ర బాస్ ప్రియురాలితో ప్రేమలో పడి.. సెకండాఫ్ విలన్‌గా మారి విధ్వంసం సృష్టించే సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కథనాల ప్రకారం అక్షయ్ 12 రకాల అవతారాల్లో దర్శనమివ్వబోతున్నాడట. ఇప్పటికే ఆన్‌లైన్ లో లీకైన దుష్ట సైంటిస్ట్ లుక్‌తోపాటు మరో 11 విభిన్నమైన అవతారాల్లో అక్షయ్ ప్రేక్షకులను భయపెట్టబోతున్నాడట. ఈ కథనల సంగతి ఎలా ఉన్నా దర్శకుడు శంకర్ సృజనను అంచనా వేయడం అంత సులభం కాదు. కాబట్టి వదంతులు ఎలా ఉన్నా.. అంతకుమించిన ట్విస్టులతో శంకర్ ప్రేక్షకులను మెప్పించే అవకాశముందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
రూ. 400 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులకు ఇటీవల జీ నెట్‌వర్క్ రూ. 100 కోట్లకుపైగా చెల్లించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ఒక పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. త్వరలోనే భారీస్థాయి వీఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్‌తో ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులను చేపట్టనున్నారు. ఇందుకు ఎంతలేదన్న ఆరు నెలల సమయం పట్టే అవకాశముంది. రజనీ, అక్షయ్‌తోపాటు యామీ జాక్సన్, సుధాన్షు పాండే, ఆదిల్ హుస్సేన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే దీపావళికి విడుదలయ్యే అవకాశముంది.