Diwali 2021 Movie Release List: కరోనా తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రతి వారం కొత్త సినిమలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. ఇక దసరా, దీపావళి సందర్భంగా భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లోకి క్యూ కడుతున్నాయి. దసరా సందర్భాంగ ఇప్పటికే ‘పెళ్లి సందD, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, వరుడు కావలెను వంటి తదితర చిత్రాలు వెండితెరపై మెరిసి ప్రేక్షకులకు బాగా అలరించాయి. ఇక దీపావళి సందర్భంగా అగ్ర హీరోల సినిమా థియేటర్లోకి వచ్చేందు రెడీ అయ్యాయి. అలాగే ఈ పండుగ సంబరాలను మరింత రెట్టింపు చేసేందుకు ఓటీటీలోకి సైతం పలు సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడోలుక్కేయండి.
‘ఎనిమి’లుగా విశాల్, ఆర్యలు
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతున్న చిత్రం ‘ఎనిమి. ఇది విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ సినిమా. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమా కూడా నవంబరు 4న తమిళ/తెలుగు భాషల్లో థియేటర్‌లలో విడుదల కానుంది.
దీపావళికి వస్తున్న ‘పెద్దన్న’
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’. ఈ మూవీని తెలుగులో సైతం ‘పెద్దన్న’గా దీపావళి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా అలరించబోతోంది. ఇక కీర్తి సురేశ్ రజనీకి సోదరిగా కనిపించనుండగా.. సీనియర్ నటీమణులు మీనా, ఖుష్బులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నవంబర్ 4న తమిళ/తెలుగులో భాషల్లో థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కరోనా తర్వాత థియేటర్లో విడుదల అవుతున్న తొలి అగ్ర హీరో మూవీగా రజనీది కావడం విశేషం.
మెహ్రీన్, సంతోష్ శోభన్‌ల్లా ‘మంచి రోజులు వచ్చాయి’
సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూప్ రూబెన్స్ స్వరాలందించారు. దీపావళి పండగను పురస్కరించుకుని ఈనెల 4న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. మారుతి శైలిలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’
అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం ‘సూర్యవంశీ’. రణ్‌వీర్‌సింగ్, అజయ్‌దేవ్‌గణ్ కీలక పాత్రలు పోషించారు. రోహిత్‌శెట్టి దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం గతేడాది విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావించినా సెకండ్‌వేవ్ కారణంగా మరోసారి ఈ మూవీ విడుదల వాయిదా పడింది. చివరకు ఈ దీపావళి కానుకగా థియేటర్‌లో సందడి చేసేందుకు నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతోంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్‌శెట్టి పిక్చర్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.
సూపర్ హీరోస్ ‘ఇటర్నల్స్’
సూపర్ హీరోస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. మార్వెల్ కామిక్స్ నుంచి ఎందరో సూపర్‌హీరోలు ప్రేక్షకులను అలరించారు. అలా మరోసారి అలరించేందుకు ‘ఇటర్నల్స్’ వస్తున్నారు. థానోస్ తర్వాత భూమిని నాశనం చేసేందుకు వస్తున్న అతీంద్రియ శక్తులైన ఏలియన్స్‌ను కొందరు సూపర్ హీరోలు ఎలా ఎదుర్కొన్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? ఇంతకాలం వాళ్లు ఎక్కడ ఉన్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. క్లోవీజావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇటర్నల్స్’ నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే!
సూర్య జై భీమ్
మాస్ హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తుంటారు. అలాంటి పాత్రలో ఆయన నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన తాజా చిత్రం ‘జై భీమ్’. తాసే జ్ఞానవేల్ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు నేపథ్యంలో ఈ మూవీ రూపొందించారు. ‘లా అనేది ఓ శక్తిమంతమైన ఆయుధం. ఎవరిని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం’ అంటూ ట్రైలర్‌లో సూర్య చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ విడుదల కానుంది.
సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’
సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వినోదభరిత చిత్రం ‘గల్లీ రౌడీ’. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ సంస్థలు నిర్మించాయి. నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సుధీర్ బాబు ‘శ్రీదేవీ సోడా సెంటర్’
కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఒకటి. వెండితెరపై అలరించిన ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రమిది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment