
పాస్‌పోర్టు మరిచిన సూపర్‌స్టార్
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ పాస్‌పోర్టు మరిచిపోవడంతో చెన్నై విమానాశ్రయంలో కలకలం చెలరేగింది. వివరాల్లోకెళ్లితే రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రాలలో కబాలి ఒకటి. ఈ చిత్రం షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. అందులో పాల్గొనడానికి సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి వెళ్లారు. ఆయనతో పాటు చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను ఉన్నారు. విమానం ఉదయం 11.45 నిమిషాలకు మలేషియా బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. రజనీకాంత్ ఇమ్మిగ్రేషన్ శోధన ప్రాంతానికి వెళ్లారు. అప్పుడే తన పాస్‌పోర్టును తీసుకురావడం మరచినట్లు తెలుసుకున్నారు. దీంతో అక్కడ పెద్ద కలకలమే జరిగింది. పాస్‌పోర్టు మరిచిన విషయాన్ని రజనీకాంత్ ఇంటికి ఫోన్ చేసి చెప్పారు.
అనంతరం విమానాశ్రయం అధికారులు ఆయన్ని విశ్రాంతి గదికి తీసుకెళ్లారు. దీంతో రజనీకాంత్ మలేషియా పయనం రద్దు అవుతుందనుకున్న పరిస్థితుల్లో ఆయన సహాయకుడు ఆగమేఘాల మీద ఒక ద్విచక్ర వాహనంలో పాస్‌పోర్టును తీసుకుని మలేషియా వెళ్లే విమానం మరి కొన్ని నిమిషాల్లో బయల్దేరుతుందనగా విమానాశ్రయానికి వచ్చారు. రజనీ పాస్‌పోర్టును పరిశీలించిన అధికారులు ఆయన పయనాన్ని ధ్రువీకరించి విమానంలోకి పంపించారు. అంత వరకూ ఉత్కంఠభరితంగా ఉన్న వాతావరణం రజనీ కాంత్ పయనం ఖాయం అవడంతో ఊపిరి పీల్చుకున్నట్లైంది. రజనీకాంత్ అక్కడున్న మీడియా వారి ఫొటోలకు ఫోజులిచ్చి మలేషియాకు పయనం అయ్యారు.