హోంమంత్రి బంధువు కాల్చివేత
లక్నో: కేంద్రహోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీప బంధువు అరవింద్ సింగ్ మంగళవారం అర్థరాత్రి దారుణ హత్యకు గురైయ్యారు. వారణాసి జిల్లాలోని పూల్పూర్లో అరవింద్ సింగ్.. తన భార్యను కారులో ఎయిర్పోర్ట్లో దింపి ఇంటికి బయలుదేరారు. ఆ క్రమంలో బైక్పై వచ్చిన దుండగులు ఆయన వాహనానికి అడ్డంగా నిలిపారు. అనంతరం వారి మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. దుండగులు వారి వద్ద ఉన్న తుపాకీతో అరవింద్పై పలుమార్లు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు.
అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... అరవింద్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి చెందాడని వైద్యులు దృవీకరించారు. ఘటన స్థలంలో .32 ఖాళీ షెల్ స్వాధీనం చేసుకున్నామని వారణాసి రూరల్ ఎస్పీ ఏకే పాండే తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఎవరోఒకరు హత్యకు గురవుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది లేదని విజయ్ బహదూర్ పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి సమీపం బంధువు అరవింద్ సింగ్ పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు.