పెండింగ్ బిల్లుల ఆమోదంకోసం రాజ్యసభ వచ్చేవారం రాత్రి ఏడు గంటల తర్వాత కూడా కొనసాగనుంది.
న్యూఢిల్లీ: పెండింగ్ బిల్లుల ఆమోదంకోసం రాజ్యసభ వచ్చేవారం రాత్రి ఏడు గంటల తర్వాత కూడా కొనసాగనుంది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు వచ్చేవారంతో ముగియనున్నాయి. దీంతో పెండింగ్ బిల్లులు, ఇతర బిల్లుల ఆమోదంకోసం వచ్చేసోమవారం నుంచి రాత్రి ఏడు గంటల తర్వాత కూడా రాజ్యసభ కొనసాగాలని గురువారం సమావేశమైన సభా కార్యకలాపాల సలహా సంఘం(బీఏసీ) నిర్ణయించింది. రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేని విషయం తెలిసిందే.
అయితే విపక్షాలతో సంప్రదింపుల అనంతరం మొత్తం ఆరు ఆర్డినెన్స్‌లకు సంబంధించి మూడింటిని బిల్లులుగా మార్చగలిగింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు, బొగ్గు గనుల బిల్లులను రాజ్యసభ సెలక్ట్ కమిటీకి నివేదించారు. ఇక పౌరసత్వ చట్ట సవరణ, మోటారు వాహనాల చట్టం, బీమా చట్టాల బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. అయితే కీలకమైన భూసేకరణ సవరణ బిల్లు మాత్రం రాజ్యసభలో ఆమోదం పొందడానికి స్వల్ప అవకాశాలు కనిపిస్తున్నాయి. గనుల బిల్లుపై చర్చకు గంట, బొగ్గు గనుల బిల్లుపై చర్చకు రెండు గంటల సమయాన్ని రాజ్యసభ బీఏసీ కేటాయించింది.