‘ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక రామ్‌దేవ్ కుట్ర’
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. యోగా గురు బాబా రామ్‌దేవ్, బీజేపీతో కలసి రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రపన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ్ బుధవారం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించి సర్కారును కూల్చడానికి బాబా రామ్‌దేవ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కుట్ర పన్నారని ఉపాధ్యాయ్ ఆరోపించారు.
దీనిపై తన వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. రామ్‌దేవ్ బీజేపీ ఏజెంటుగా పనిచేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను గురువారం బాబా రామ్‌దేవ్ ఖండించారు. తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత సంక్షోభానికి తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు.