ఆ పవర్ బీఫ్లో కాదు.. ఆవునెయ్యిలో ఉంది
సాధారణంగా క్రీడాకారులకైనా.. ఒలింపిక్ పతకాలు గెలవాలన్నా.. శారీరక దారుఢ్యం ఉండాలి. బాడీ ఫిట్నెస్ కోసం ఏ ఆహారం తీసుకోవాలి..? యోగాగురు బాబా రాందేవ్ మాత్రం ఆవు నెయ్యి తినాలని చెబుతున్నారు. జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ బీఫ్ తినడం వల్లే తొమ్మిది ఒలింపిక్ స్వర్ణ పతకాలు గెలిచాడని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలను రాందేవ్ తప్పుపట్టారు. ఆవు నెయ్యి తింటే నిజమైన చాంపియన్లు తయారవుతారని, బీఫ్ వల్ల కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ఆవు నెయ్యిలో అంతటి శక్తి ఉందని చెప్పారు.
బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బోల్ట్ చాలా పేదవాడని, బీఫ్ తినాల్సిందిగా అతని కోచ్ సలహా ఇచ్చాడని, దీనివల్లే బోల్ట్ తొమ్మిది ఒలింపిక్ పసిడి పతకాలు గెలిచాడని ట్వీట్ చేశాడు. కాగా బోల్ట్ మెనూలో బీఫ్ లేదు. బోల్ట్ మెనూలో ప్రధానంగా చికెన్, పోర్క్, చేపలు, దుంపకూరలు ఉంటాయి.