'ఆ హీరో గ్రాఫ్ పడిపోవడానికి నేనే కారణం'
రణ్‌బీర్ కపూర్ నిన్నమొన్నటి వరకు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఎదుగుతాడని అంతా భావించారు. 'వేకప్ సిద్', 'బర్ఫీ', 'యే జవానీ హై దీవానీ' వంటి వరుస విజయాలతో జోరుమీద ఉన్న రణ్‌బీర్ కు 2013లో 'బేషరమ్' సినిమాతో బ్రేక్ పడింది. అనురాగ్ కశ్యప్ సోదరుడు అభినవ్ కశ్యప్ తెరకెక్కించిన ఈ సినిమా చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ తీసిన భారీ సినిమా 'బాంబే వెల్వెట్' (2015) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. రణ్‌బీర్‌ను కోలుకోలేనివిధంగా దెబ్బ తీసింది. ఆ తర్వాత హిట్టు కోసం రణ్‌బీర్ అల్లాడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి తానే కారణమన్న బాధ తనను వెంటాడుతోందని, ఇందుకు తనదే బాధ్యత అని దర్శకుడు అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.
''బాంబే', 'బేషరమ్' రెండు సినిమాలు నన్ను వ్యక్తిగతంగా దెబ్బతీశాయి. ఈ విషయాలన్నీ (రణ్‌బీర్ కెరీర్ దెబ్బతినడం) నన్ను ప్రభావితం చేశాయి. ఎవరి చేసిన పనికి వారిదే బాధ్యత కాబట్టి. ఇందుకు నాదే బాధ్యత' అని అనురాగ్ 'పీటీఐ'తో చెప్పారు. 'రణ్‌బీర్ చాలా మంచి నటుడు. ప్రయోగాలు చేసుందుకు సిద్ధపడేవాడు. మేమంతా కలిసి ఉమ్మడిగా అతని వైఫల్యానికి కారణమయ్యాం' అని చెప్పాడు. అనురాగ్, అతని సోదరుడి వల్ల 'బర్ఫీ' స్టార్ రణ్‌బీర్ కెరీర్ కుదేలైందని కథనాలు కూడా వచ్చాయి. అయితే, ఈ రెండు సినిమాలు అట్టర్‌ప్లాప్ అయినా.. రణ్‌బీర్‌తో తనకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని, తాము మామూలుగానే మాట్లాడుకుంటామని అనురాగ్ చెప్పాడు.