శశికళ.. నా ఓటు నీకు కాదు..!
చిన్నమ్మ తీరుపై ఆగ్రహంతో ర్యాపర్ పాట..
'ప్రజాస్వామ్యం చచ్చిపోయింది'.. 'నా ఓటు నీకు కాదు' అంటూ పరోక్షంగా శశికళను ఎత్తిచూపుతూ సోఫియా అష్రఫ్ పాడిన పాట ఇప్పుడు సోషల్‌మీడియాలో దుమారం రేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ఎన్నిక కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అర్ధరాత్రి చెన్నైలోని బిన్నీరోడ్డులో ఆమె తన బృందంతో పాడిన ఈ సాంగ్ వైరల్‌గా మారిపోయింది.
'ఓట్ల కోసమే ప్రకటనలు.. విశ్వసనీయత లేని హామీలు. ఎవరూ మంచి వారు కారు.. నా ఓటు నీకు కాదు..' అంటూ సూటిగా ఆమె పాడిన పాట నెటిజన్లను కదిలిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పార్టీ నేతలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను ఎన్నుకున్న నేపథ్యంలో ఈ పాటను సోఫియా రూపొందించారు. బిన్నీరోడ్డు పరిసరాల్లో తిరుగుతూ పాడిన ఈ పాటను చిత్రీకరించి.. సోషల్‌మీడియాలో పెట్టగా.. ఆ వీడియోను ఇప్పటికే నాలుగువేలకుపైగా లైక్ చేశారు. ఒక లక్ష 95వేల మంది వీక్షించారు. 3.6వేల మంది షేర్ చేసుకున్నారు.
దోపిడీదారులు, లంచగొండులు, ద్రోహులు, పార్టీ మారే ఊసరవెల్లులు అంటూ సాగే ఈ పాటలో రాజకీయ నాయకులు ఇస్తున్న ఉచిత హామీల ఔచిత్యాన్ని ప్రశ్నించారు. నేనేమైనా సాయమడిగానా? నేనేమైనా నీ సీటు అడిగానా? అంటూ కడిగిపారేశారు. చివరకు 'ప్రజాస్వామ్యం చచ్చిపోయింది' అంటూ ఆవేదనగా పాటను ముగించారు.