తమిళనాట పరిణామాలపై కాంగ్రెస్ నేత దిగ్భ్రాంతి!
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎన్నికకావడంపై కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులోని ప్రస్తుత పరిస్థితులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. శశికళకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదని, ముఖ్యమంత్రి కావడానికి ఆమెకు అర్హత లేదని ఆయన వ్యాఖ్యానించారు. శశికళపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
శశికళను ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నప్పటికీ, ఆమె ప్రమాణస్వీకారంపై అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు ఇంకా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో చిన్నమ్మ ప్రమాణం ఎప్పుడనేది ఇంకా తేలడం లేదు.