ఎలుకలు కొరికాయి కానీ..
శిశువు మృతికి అవే కారణం కాదు
* ప్రభుత్వానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ నివేదిక
* నివేదికలో విభిన్న అంశాలు
* పుట్టుకతోనే శిశువుకు అసాధారణ లోపం ఉంది
* రెండు సార్లు మాత్రం ఎలుకలు కొరికాయి
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శిశువుపై దాడి అభియోగం నుంచి ‘ఎలుకలను’ తప్పించే ప్రయత్నం జరిగింది. ఆస్పత్రిలో ఎలుకల సంచారం తీవ్రంగా ఉన్నప్పటికీ అవి కొరికిన కారణంగానే హృదయవిదారకరీతిలో శిశువు మృతిచెందలేదని చెప్పడానికి అధికారులు, ప్రభుత్వ పెద్దలు శతవిధాలా ప్రయత్నించారు. ఆస్పత్రిలో చేరినప్పుడే శిశువు అనేక సమస్యలతో బాధపడుతున్నాడని పేర్కొంటూ నివేదిక సమర్పించారు. మరణానికి ఎలుక లు కొరకడమే కారణం కాకపోవచ్చంటూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు.
ఆ శిశువు ఈనెల 17వ తేదీన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరాడని, కన్‌జెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే అసాధారణ లోపం)తో ఉన్న ఆ శిశువును 18వ తేదీన సర్జరీ వార్డుకు తరలించారని నివేదికలో పేర్కొన్నారు. 20వ తేదీన శస్త్రచికిత్సకు సిద్ధం చేశారని, ఆ శిశువు పరిస్థితి అప్పటికే ప్రమాదకరంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నాడని నివేదికలో పేర్కొన్నారు. ఈనెల 23న శిశువు ఎడమచేతికి ఎలుకలు గాయం చేశాయని, ఈ విషయాన్ని ఇన్‌చార్జి ప్రొఫెసర్ డా.భాస్కరరావుకు సమాచారమిచ్చినట్టు కూడా నివేదికలో పొందుపరిచారు.
అనంతరం వార్డును శుభ్రపరిచామని, అయినా ఈనెల 26 తెల్లవారుజామున 4-5గంటల మధ్యలో ఎలుకలు తిరిగి శిశువు ఛాతీపై దాడిచేశాయని పేర్కొన్నారు. ఈ రకంగా ఓవైపు ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని చెబుతూనే మరోవైపు కన్‌జెనిటల్ అనామిలీస్‌తో వచ్చిన ఈ బిడ్డ మృతికి ఎలుకలే కారణం కాకపోయి ఉండొచ్చని నివేదించారు. బుధవారం సాయంత్రం అంటే 26 వ తేదీ రాత్రి బిడ్డ మృతి చెందిన తర్వాత మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ తదితరులు ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఎలుకల కథ కంచికి చేరేలా ఈ నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది.
ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవడం, వివిధ మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడం, దీన్ని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించిన తరుణంలో ఘటన తీవ్రతను, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలంటూ నాయకులు ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్‌ఎంవో తదితర కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.
వార్డులో మరో 20 మంది చిన్నారులు ఉన్నా ఎవరినీ ఎలుకలు కొరకలేదని, అందువల్ల ఈ శిశువు కూడా ఎలుక కొరికిన కారణంగా మృతి చెంది ఉండకపోవచ్చని నివేదికలో పొందుపరిచారు. మరోవైపు శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందే తమ బిడ్డ మృతికి కారణమని గొడవ చేశారని కూడా అందులో ప్రస్తావించారు.
సూపరింటెండెంట్ అందించిన నివేదిక మేరకు పీడియాట్రిక్ వార్డు డ్యూటీలో ఉన్న సిబ్బంది
⇒ డా.సీహెచ్ భాస్కర్ రావు, ప్రొఫెసర్, ఇన్‌చార్జి హెచ్‌ఓడీ
⇒ డా.ఎన్‌జైపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్
⇒ సీహెచ్ విజయలక్ష్మి, హెడ్‌నర్స్
⇒ ఎం.ఉషా జ్యోతి, స్టాఫ్‌నర్స్
⇒ వి.విజయ నిర్మల, స్టాఫ్‌నర్స్
⇒ జి.జయజ్యోతి కుమారి, స్టాఫ్‌నర్స్