పదివేల ఉద్యోగాల కోత
ఆటోమేషన్ ముప్పు అంతకంతకూ ముదురుతోంది. ఈ కారణంగా కోల్పోతున్న ఉద్యోగాల సంఖ్యం రోజురోజు పెరుగుతోంది. తాజాగా టెక్స్‌టైల్స్ దిగ్గజం రేమండ్ దేశంలో భారీగాఉద్యోగాల కోత పెట్టనున్నట్టు తెలుస్తోంది. సాఫ్ట్ వేర్ సెక్టార్ ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ పేరుతో 10,000 ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. రాబోయే మూడేళ్లలో తయారీ ప్లాంట్లలో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఉద్యోగులను తగ్గించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. వీరి స్థానంలో రోబోలు, అధునాతన టెక్నాలజీని వినియోగించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించనున్నట్లు పేర్కొంది. రోబో ద్వారా 100 కార్మికులు భర్తీ చేయవచ్చని రేమండ్ సీఈవో సంజయ్ బెహల్ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ ఇన్వెన్షన్ ద్వారా తమ ఉద్యోగుల సంఖ్యను 20 వేలకు తగ్గించుకుంటున్నట్టు తెలిపింది.
దీంతోపాటుగా దేశంలోని కొన్న ప్రయివేటు బ్యాంకులుకూడా ఉద్యోగుల స్థానంలో రోబోలు నియమించుకునేందుకు యోచిస్తున్నట్టు టెక్నాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కస్టమర్ల ఐడీలు సృష్టించేందుకు, అప్ డేట్ చేసేందుకు , ఏటీఎం సంబంధింత సమస్యలను పరిష్కరించేందుకు రోబో సేవలను వినియోగించుకోనున్నట్టు ఐసీఐసీఐ ఇటీవల ప్రకటించింది. రెండవ అతిపెద్ద బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా తన ముంబై బ్రాంచ్ లో రోబో సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నామని తెలిపింది. కాగా దేశ వ్యాప్తంగా 16 యూనిట్లలో ముప్పయి వేలమందికి పైగా ఉద్యోగులున్నారు.