భవిష్యత్తులో రాష్ట్రంలో 37.5 శాతం తగ్గనున్న ఉద్యోగాలు | Automation In Work Place Will Reduce The Jobs | Sakshi
Sakshi News home page

‘ఆటోమేషన్‌’తో కొలువులకు కత్తెరే!

Published Mon, Feb 4 2019 1:38 AM | Last Updated on Mon, Feb 4 2019 11:09 AM

Automation In Work Place Will Reduce The Jobs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమీప భవిష్యత్తులో దేశంలో గణనీయమైన స్థాయిలో ఉద్యోగాలకు ఎసరు పెడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇప్పటికే వివిధ రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆటోమేషన్‌ (యాంత్రీకరణ) వంటి సాంకేతిక ప్రక్రియల ప్రభావంతో భవిష్యత్తులో మానవవనరుల ఆధారిత ఉద్యోగాలు తగ్గిపోతాయని యాస్పైరింగ్‌ మైండ్స్‌ అనే సంస్థ ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌–2018 పేరిట రూపొందించిన నివేదికలో అంచనా వేసింది. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ అండ్‌ రోబోటిక్స్‌దేనని తెలిపింది. ఆటోమేషన్‌ కారణంగా ఢిల్లీలో అత్యధికంగా 45.1% ఉద్యోగాలు తగ్గిపోనున్నాయని, తెలంగాణలో 37.5% ఉద్యోగాలు తగ్గిపోతాయని నివేదిక పేర్కొంది. అదే సమయంలో సాఫ్ట్‌ స్కిల్స్, అంచనా సామర్థ్యాలు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాయని వివరించింది. డేటా అనాలిసిస్, మార్కెటింగ్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, జనరల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి రంగాల్లో ఆటోమేషన్‌ ప్రభావం తక్కువగా ఉంటుందని, అక్కడ మానవ వనరులే కీలకమని నివేదిక వివరించింది. 

ఏఐ, రోబోటిక్స్‌తో నూతన శకం... 
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లర్నింగ్‌ అండ్‌ రోబోటిక్స్, ఆటోమేషన్‌ వల్ల దేశంలో నూతన శకం రాబోతోందని నివేదిక పేర్కొంది. ఆటోమేషన్‌ కారణంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళన నెలకొన్నా ఆయా రంగాల్లోనూ మానవ అవసరాల పాత్ర ప్రముఖంగానే ఉంటుందని వెల్లడించింది. భవిష్యత్తులో మన దేశంలో ఆటోమేషన్‌ ప్రభావం ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో 42 శాతం మేర ఉండనున్నప్పటికీ, ఆ రంగంలో 31 శాతం మేర ఉద్యోగాలు ఉంటాయని పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, సపోర్ట్‌ టెక్నీషియన్, నెట్‌వర్కింగ్‌ ఇంజనీర్, సిస్టమ్‌ అనలిస్ట్, అనుబంధ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. సివిల్, మెకానికల్‌ వంటి సబ్జెక్టులుగల కోర్‌ ఇంజనీరింగ్‌ చదివిన వారికి 7 శాతమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పేర్కొంది. అయితే ఆంగ్ల భాషా నైపుణ్యం అవసరమైన రంగాల్లో ఉద్యోగాలకు 100 శాతం డిమాండ్‌ ఉంటుందని, సేల్స్, మార్కెటింగ్‌ రంగాల్లోనూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండనున్నాయని నివేదిక వెల్లడించింది. లేబర్‌ మార్కెట్‌లోని 30 రకాల ఉద్యోగాల్లో మానవ నైపుణ్యాలకు అధిక డిమాండ్‌ ఉంటుందని వివరించింది. బిజినెస్‌ అభివృద్ధి, ఆదాయ వృద్ధిలో కీలకమైన సేల్స్‌ రంగంలో 12 శాతం ఉద్యోగాలు లభిస్తాయని నివేదిక అంచనా వేసింది. లాజికల్‌ ఎబిలిటీ, భాషా నైపుణ్యాలు కలిగిన ఇందులో ప్రధానంగా అవసరమని పేర్కొంది. సంప్రదింపుల్లో వాక్‌చాతుర్యంతో ఇతరులను ప్రభావితం చేయగలగాలని పేర్కొంది. 

కస్టమర్‌ సర్వీసు విభాగంలో భారీగా ఆటోమేషన్‌... 
కస్టమర్‌ సర్వీస్‌లో ఆటోమేషన్‌ పాత్ర మరింత పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. 2020 నాటికి 85 శాతం మేర ఆటోమేషన్‌ ప్రక్రియ ద్వారానే కస్టమర్‌ ఇంటరాక్షన్‌ జరుగుతుందని పేర్కొంది. అలాగే అకౌంటింగ్, బ్యాంకింగ్‌ రంగాల్లో ఆటోమేషన్‌ వినియోగం మరింత పెరుగుతందని వివరించింది. 

భవిష్యత్తులో ఆటోమేషన్‌తో వివిధ రాష్ట్రాల్లో తగ్గనున్న ఉద్యోగాలు... 
రాష్ట్రం                 తగ్గనున్న ఉద్యోగాల శాతం 
ఢిల్లీ                     45.1 
పశ్చిమ బెంగాల్‌    42.2 
హరియాణా          39.3 
ఉత్తరప్రదేశ్‌          39 
రాజస్తాన్‌            37.8 
మధ్యప్రదేశ్‌         37.8 
కర్ణాటక             37.8 
తమిళనాడు       37.6 
తెలంగాణ          37.5 
ఆంధ్రప్రదేశ్‌        37.2  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement