బాదుడుకు బ్రేక్..!
ముంబై: ఆర్‌బీఐ బుధవారం చేపట్టిన మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ కాస్త ఉదారంగా వ్యవహరించింది. కీలకమైన రెపో రేటు(ఆర్‌బీఐ వద్దనుంచి తీసుకునే స్వల్పకాలిక నిధులపై బ్యాంకులు చెల్లించే వడ్డీ)ను యథాతథంగా 7.75 శాతంగానే వదిలేసింది. అదేవిధంగా నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్-బ్యాంకుల వద్ద నున్న డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన మొత్తం-దీనిపై ఎలాంటి వడ్డీ లభించదు)ని ఇప్పుడున్న 4% వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, రివర్స్ రెపో(బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద డిపాజిట్ చేసే నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ) 6.75%గా ప్రస్తుత స్థాయిలోనే ఉంటుంది. ఇక మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్-8.75%) ఎలాంటి మార్పూ లేదు. కాగా, తదుపరి మూడో త్రైమాసిక పాలసీ సమీక్ష జనవరి 28న జరగనుంది.
అంతా అవాక్కు...!
అటు టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం, ఇటు రిటైల్ ద్రవ్యోల్బణం కూడా చుక్కలు చూపిస్తుండటంతో ఆర్‌బీఐ మరోవిడత రేట్లను పెంచుతుందని విశ్లేషకులు, నిపుణులు అంచనాలు వేశారు. పావు శాతం పెంచొచ్చని అత్యధికులు అభిప్రాయపడ్డారు. కొంతమంది అర శాతం పెంపును కూడా కొట్టిపారేయలేమన్నారు. అయితే, రాజన్ మాత్రం ఎక్కడి రేట్లు అక్కడే ఉంచుతూ మార్కెట్ వర్గాలు, విశ్లేషకులను అవాక్కయ్యేలా చేశారు. సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాజన్... వరుసగా రెండు సమీక్షల్లో కూడా పావు శాతం చొప్పున రెపో రేటును పెంచడం తెలిసిందే.
కాగా, నవంబర్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టానికి(7.52%), రిటైల్ ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్టానికి(11.24%) ఎగబాకడం విదితమే. దీంతో ఆర్‌బీఐ కచ్చితంగా పాలసీ రేట్లను మరోసారి పెంచుతుందనే అంచనాలు వెల్లువెత్తాయి. మరోపక్క, అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి తిరోగమన బాటలోకి జారి మైనస్ 1.8 శాతానికి కుంగడంతో కార్పొరేట్లు వడ్డీరేట్ల తగ్గింపు డిమాండ్‌లు జోరందుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్‌బీఐ పాలసీ యథాతథంగా కొనసాగడం గమనార్హం.
పసిడి నియంత్రణలపై...
కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ను తగ్గించేందుకుగాను బంగారం దిగుమతులపై విధించిన నియంత్రణలను ఎత్తివేసేందుకు సుముఖమేనని... అయితే, ఇది సరైన సమయం కాదని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. దీనికి ఇంకా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్‌బీఐ, ప్రభుత్వ చర్యల ప్రభావంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో క్యాడ్ 1.2 శాతానికి దిగొచ్చిన సంగతి తెలిసిందే. క్యూ1లో ఇది 4.9 శాతంగా ఉంది. క్రితం ఏడాదిలో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టాన్ని(4.8%) తాకడం తెలిసిందే. మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారక నిధుల మధ్య వ్యత్యాసమే క్యాడ్.
త్వరలో ధరల ఆధారిత పొదుపు పత్రం
వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణానికి అనుసంధానమైన ‘పొదుపు పత్రాన్ని’ ఈ నెలాఖరుకల్లా ఆర్‌బీఐ ఆవిష్కరించనుంది. సీపీఐ వార్షిక సగటుకన్నా 1.5% అధికంగా ఈ ప్రొడక్ట్‌పై వడ్డీరేటు ఉంటుందని రాజన్ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో డిపాజిట్ చేసిన సొమ్ముకు నిర్దిష్ట టర్మ్ తర్వాత తగిన రిటర్న్స్ రాకపోగా, నెగిటివ్ రాబ డులు నమోదవుతున్న నేపథ్యంలో తాజా పథకానికి ఆర్‌బీఐ రూపకల్పన చేసింది. ద్రవ్యోల్బణం సూచీ అ నుసంధాన పత్రం(ఐఐఎస్‌సీ)గా ఇది విడుదలవుతోం ది. పెట్టుబడులు, పొదుపు కోణంలో ద్రవ్యోల్బణం స వాళ్లను అధిగమించడానికి ఆర్‌బీఐ అంతక్రితం ప్రారంభించిన ఐఐబీ(ఇన్‌ఫ్లేషన్ ఇండెక్డ్స్ బాండ్లు) తర్వాత, ప్రతిపాదిత పొదుపు పత్రాలు కొత్త సిరీస్‌లోకి వస్తాయి.
ఎప్పుడైనా పెంచుతాం: రాజన్
ఆహార, ఇంధన ద్రవ్యోల్బణం గనుక దిగొస్తున్న సంకేతాలు వెలువడకపోతే... పాలసీ తేదీతో సంబంధం లేకుండా ఆర్‌బీఐ రేట్ల పెంపు ఇతరత్రా చర్యలను తీసుకుంటుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం చాలా అధికస్థాయిలో ఉంది. మరోపక్క ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాలసీ చర్యల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాం. అనిశ్చిత పరిస్థితులు తొలగేందుకు మరింత డేటా కోసం వేచిచూడటం వల్ల కొన్ని సానుకూలతలు ఉన్నాయి. మరోపక్క, దీనివల్ల కొన్ని రిస్క్‌లూ లేకపోలేదు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణను మొదలుపెడితే... వర్ధమాన మార్కెట్లపై తీవ్ర ప్రభావంచూపే అవకాశం ఉంటుంది. దీంతో ద్రవ్యోల్బణంపై పోరు విషయంలో కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొనే ఆర్‌బీఐ మరింత అప్రమత్తంగా వ్యవహరించనుంది. చాన్నాళ్లుగా ఆర్థిక వ్యవస్థ బలహీన ధోరణిలో ఉండటం వల్లే.. ద్రవ్యోల్బణం కంటే వృద్ధిరేటుకు తోడ్పాటు దిశగా తాజా పాలసీలో ప్రధానంగా దృష్టిపెట్టాల్సి వచ్చింది. కాగా, వ్యవసాయ రంగం మెరుగైన వృద్ధి, ఎగుమతుల మెరుగుదల, జాప్యాలతో నిలిచిపోయిన ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుండటంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో వృద్ధి రేటు పుంజుకునే అవకాశాలున్నాయి.
స్వాగతించిన కార్పొరేట్లు...
వడ్డీరేట్లను పెంచకుండా ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని కార్పొరేట్లు స్వాగతించారు. ‘సమీక్షలో ఆర్‌బీఐ దూరదృష్టిని కనబరిచింది. వృద్ధి-ద్రవ్యోల్బణం అంశాలను ఎదుర్కోవడానికి సమన్వయంతో వ్యవహరించింది’ అని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘పారిశ్రామిక రంగం చాలా దుర్భర పరిస్థితుల్లో ఉందన్న విషయాన్ని ఆర్‌బీఐ ఎట్టకేలకు గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. తదుపరి సమీక్షలో వడ్డీరేట్ల తగ్గింపు దిశగా చర్యలు ఉండొచ్చని భావిస్తున్నాం’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనా లాల్ కిద్వాయ్ పేర్కొన్నారు. తగినంత లిక్విడిటీ వ్యవస్థలో ఉన్నందున బ్యాంకులు రుణ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. పెట్టుబడులకు చేయూతనివ్వాలని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అభిప్రాయపడ్డారు.
రుణ, డిపాజిట్ రేట్లు తగ్గవు: బ్యాంకర్లు
ఆర్‌బీఐ ఆశ్చర్యకరమైన నిర్ణయం నేపథ్యంలో తాము రుణ, డిపాజిట్ రేట్లను తగ్గించే అవకాశాల్లేవని బ్యాంకర్లు పేర్కొన్నారు. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఇది దోహదపడుతుందని ఆర్‌బీఐ చర్యలను ఆహ్వానించారు. ఎవరేమన్నారంటే...
డిపాజిట్ రేట్లను తగ్గించే యోచనేదీ లేదు. ఇది వారిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. జూలై 15 నాటితో పోలిస్తే మా డిపాజిట్లు రేట్లు చాలా అధికస్థాయిలోనే ఉన్నప్పటికీ.. తక్షణం వీటిని తగ్గించే అవకాశాల్లేవు.
- అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చైర్మన్
ఇప్పుడున్న పరిస్థితుల్లో రుణ, డిపాజిట్ రేట్లను తగ్గించేందుకు చాన్స్ లేదు. ద్రవ్యోల్బణం చాలా అధికస్థాయిలో ఉండటమే దీనికి కారణం. అయితే, బల్క్ డిపాజిట్ రేట్లను తగ్గించే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం’
- విజయలక్ష్మి ఆర్. అయ్యర్,బీఓఐ చైర్‌పర్సన్
రానున్న కాలంలో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం మరింత ఎగబాకే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న దృక్పథంతోనే ఆర్‌బీఐ పాలసీని యథాతథంగా కొనసాగించింది’
- ఎం. నరేంద్ర,ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ
కీలక పాలసీ రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పులు చేయకపోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. కొనసాగుతున్న వృద్ధి మందగమనం ధోరణి, రానున్న రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలను దృష్టిలోపెట్టుకొనే ఆర్‌బీఐ ఈ విధంగా వ్యవహరించింది. ఆర్థిక రికవరీకి ఇది తోడ్పడుతుంది’
- చందా కొచర్,ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ