ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో తొలినోట్ విడుదల కానుంది. గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి సంతకంతో ఇరవై రూపాయల నోటు త్వరలోనే వినియోగంలోకి రానుంది. ఉర్జిత్ సంతకం చేసిన రూ.20 నోట్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. మహాత్మాగాంధీ-2005 సిరీస్‌లో వస్తున్న ఈ నోట్లపై నంబర్ ప్యానల్స్‌పై ఆర్ ఇంగ్లీష్ అక్షరంతోపాటు, డాక్టర్ ఉర్జిత్ ఆర్.పటేల్, గవర్నర్, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, 2016 అని నోట్లపై ముద్రించినట్టు ఆర్బీఐ తెలిపింది.
ఈ నోట్ల డిజైన్, భద్రత ఫీచర్లు గాంధీ-2005 సిరీస్ నోట్ల మాదిరిగానే ఉంటాయని కేంద్ర బ్యాంకు ప్రకటించింది. మొదటి మూడు ఆల్ఫా-న్యూమరిక్ అక్షరాలు (ఎడమ నుండి కుడికి ఆరోహణ పరిమాణంలో) పెరుగుతూ వస్తాయి. అయితే తొలి మూడు సంఖ్యలు సున్నాతో ప్రారంభం కానున్నాయి. అలాగే నోట్ కు ఎడమవైపు దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఐటిడెంటిఫికేషన్ మార్క్ ను తొలగిస్తున్నట్టు వెల్లడించింది. అయితే రివర్స్ సైడ్ రంగుల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, కానీ ఆఫ్ సెట్ ప్రింటింగ్ కారణంగా ముఖ భాగం రంగు తక్కువ ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.