సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపులో ‘స్థానికత’ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల (371డి) ప్రకారం వ్యవహరించాలని... విద్యార్థి చేరిన కోర్సుకు పూర్వం ఏడేళ్లలో నాలుగేళ్ల పాటు ఏ ప్రాంతంలో చదివితే ఆ ప్రాంతాన్నే ఆ విద్యార్థి స్థానికతగా నిర్ధారించాలనే భావనకు వచ్చింది. ఉదాహరణకు తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇక్కడ ప్రస్తుతం డిగ్రీ లేదా పీజీలో చేరడానికి ముందు కర్నూలులో లేదా విజయనగరం జిల్లాలో వరుసగా నాలుగేళ్ల పాటు చదివి ఉంటే వారిని అక్కడి స్థానికులుగానే పరిగణిస్తారు.
అలాగే ఆంధ్రా ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఏడేళ్లలో వరుసగా నాలుగేళ్లపాటు తెలంగాణలో చదివితే వారిని ఇక్కడి స్థానికులుగా గుర్తిస్తారు. అయితే ఇది విద్యావకాశాల వరకే వర్తిస్తుందని, ఉద్యోగాలను పొందే విషయంలో మాత్రం వారిని స్థానికులుగా గుర్తించడానికి అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇతర నియమ, నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్నారు.
ఇక విభజనకు ముందు, తర్వాత ఏపీ, తెలంగాణలకు చెందిన విద్యార్థులు ఆయా ప్రాంతాల్లో చదివితే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విభజన చట్టానికి అనుగుణంగా 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
పలు అంశాల్లో స్పష్టత కరువు..
గత నాలుగేళ్లలో తెలంగాణ విద్యార్థులు ఏపీలోని చదువుకుని ఉంటే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏవిధంగా చె ల్లించాలనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థులు కర్నూలులో, ఖమ్మం జిల్లా విద్యార్థులు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో... ఇలా ఇతర జిల్లాల్లో చదువుకున్న విద్యార్థులు వేలసంఖ్యలోనే ఉన్నారు. వారికి ఫీజు చెల్లింపుపై త్వరలోనే ఆదేశాలు జారీచేయనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. గత ఏడేళ్లలో నాలుగేళ్లపాటు స్థానిక ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తేనే స్థానిక విద్యార్థులుగా ‘ఫీజు’ వర్తిస్తుందని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సమస్య తలెత్తింది.
ఆ 26 కులాలకు 2014-15 నాటికే!
తెలంగాణ ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో లేని 26 కులాలను (ఏపీలోని ఆయా జిల్లాలకు పరిమితమైన కులాలు) రాష్ట్ర బీసీ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. తూర్పుకాపు, కాళింగ, కొప్పుల వెలమ, శెట్టిబలిజ తదితర 26 కులాలకు చెందిన విద్యార్థులకు 2014-15కు సంబంధించిన ఫీజు బకాయిలను మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2014-15 వరకు పాత పథకాన్నే కొనసాగిస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
నాలుగేళ్లు చదివితే స్థానికులే!
Published Tue, Sep 15 2015 1:47 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement