అద్వానీని కలిసిన సీమాంధ్ర ఎంపీలు
న్యూఢిల్లీ: సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరారు. సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును మనోహర్ జోషితో కలిసి అద్వానీ దీన్ని పరిశీలించారు. ఇందులో తెలంగాణ పేరు లేనందున అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని సీమాంధ్ర ఎంపీలకు అద్వానీ హామీయిచ్చారు. సుష్మా స్వరాజ్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వారికి తెలిపారు.
మరోవైపు మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని 9 సీమాంధ్ర ఎంపీలు కలవనున్నారు. ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎంపీలు కోరనున్నారు. రెబల్ ఎంపీలతో పాటు కనుమూరి బాపిరాజు, అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాష్ట్రపతిని కలవనున్నారు.