సస్పెన్షన్లకు భయపడం: ఎంపీ హర్షకుమార్
న్యూఢిల్లీ : సస్పెన్షన్లకు తాము భయపడేది లేదని అమలాపురం కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు వాయిదా అనంతరం ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినందునే తాము యూపీఏ సర్కార్పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పోరాటం చేస్తున్నామన్నారు.
పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదని హర్షకుమార్ స్పష్టం చేశారు. పార్టీలోనే ఉండే తాము పోరాటం చేస్తామన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందనే నమ్మకం ఉందని... అన్నిపార్టీలు తమకు మద్దతు ఇస్తాయని హర్షకుమార్ ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని అందరి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
తాము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదని....యూపీఏ నిర్ణయానికి వ్యతిరేకం అన్నారు. తాము అన్నింటికి సిద్ధపడే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఆరుగురు ఎంపీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఏఐసీసీ ప్రతినిధి పీసీ చాకో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఇక సీమాంధ్ర ఎంపీలపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల విమర్శలపై హర్షకుమార్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాగాంధీని టీఆర్ఎస్ నేతలు తిట్టినప్పుడు తెలంగాణ మంత్రులు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నాడు క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు....నేడు తమ క్రమశిక్షణను అడగటం సరికాదన్నారు.
టీఆర్ఎస్లోకి వెళ్లిన మందా జగన్నాధం, వివేక్పై ఏం చర్యలు తీసుకున్నారని హర్షకుమార్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించిన ఎంపీ రాజయ్య తమను ప్రశ్నించే హక్కు లేదన్నారు. 2004లో ఎమ్మెస్సార్పై పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ తమను విమర్శించటమా అన్నారు.