'సొంత ఎంపీలే అవిశ్వాస తీర్మానం పెడతారనుకోలేదు'
న్యూఢిల్లీ : సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం పెడతారనుకోలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానం నోటీసును వారు వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. కొందరు సీమాంధ్ర ఎంపీలతో ఇప్పటికే మాట్లాడినట్లు దిగ్విజయ్ తెలిపారు.
జేసీ దివాకర్ రెడ్డి ఎందుకలా మాట్లాడారో ఆలోచించాల్సి ఉందని దిగ్విజయ్ అన్నారు. సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని జేసీ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి విరుద్దంగా తిరుగుబాటు చేస్తున్నారని తాము భావించటం లేదన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కొన్ని అంశాలను సీఎం లేవనెత్తుతున్నారని దిగ్విజయ్ తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామన్న సీఎం వ్యాఖ్యలపై తన వద్ద పూర్తి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు.