అవిశ్వాసం ప్రకటించినందునే బహిష్కరణ: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ : సొంత సర్కారుపైన అవిశ్వా సం ప్రకటించినందునే ఆ ఆరుగురు ఎంపీలను బహిష్కరించామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. మంగళవారం సాయంత్రం ఆయన్ని కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఆ ఎంపీలు వారి సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టేందుకు సంతకాలు చేశారు. వారిని బుజ్జగించాం. కానీ వారు పదేపదే అదే తీరుతో వ్యవహరిస్తున్నారు. అందువల్ల బహిష్కరణ చర్య తీసుకున్నాం’ అని తెలిపారు. పార్టీ నుంచి బహిష్కృతులైన ఎంపీలను సభలో సస్పెండ్ చేస్తారా? అని అడగ్గా.. ‘‘అది సభాపతికి సంబంధించిన అంశం’’ అని చెప్పారు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ, బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన ముఖ్యమంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అది సమస్య కాదు. కానీ ఈ ఎంపీలు సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చారు’’ అని అన్నారు. తెలంగాణ బిల్లు 11న రాజ్యసభకు వస్తుందని చెప్పారు కదా అని అనగా.. ‘‘అది ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్న బిల్లు. అందువల్ల అది లోక్‌సభకు వస్తోంది’’ అని చెప్పారు. కేసీఆర్, సోనియాల భేటీ గురించి ప్రస్తావించగా.. ‘‘కేసీఆర్ అందరినీ కలుస్తున్నారు. బీజేపీ నేతలను కూడా కలిశారు’’ అని అన్నారు. టీఆర్‌ఎస్ విలీనంపై కేసీఆర్‌నే అడగండని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తెలంగాణ ఏర్పాటు దిశలో బహిష్కరణ ఓ అడుగు: మాకెన్
పార్టీ ఎంపీల బహిష్కరణ చర్య తెలంగాణ ఏర్పాటు కోసం పడుతున్న అడుగుల్లో ఒకటని ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తెలంగాణకు వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా.. ‘‘ప్రస్తుతం పార్లమెంటులో బిల్లు పాస్ కావాలి. మిగిలిన విషయాలపై విభిన్న స్థాయిల్లో నిర్ణయాలు ఉంటాయి’’ అని చెప్పారు. బీజేపీ నేతలతో ప్రధానమంత్రి విందు దౌత్యంపై ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘అధికార పార్టీ ఎప్పుడూ బిల్లులు పాస్ అయ్యేందుకు అన్ని పార్టీలతో సమావేశాలు జరుపుతుంది. ప్రధానమంత్రి చేసేది కూడా అదే. అవినీతి వ్యతిరేక బిల్లులు, తెలంగాణ బిల్లు, రోడ్డు పక్క వ్యాపారుల బిల్లులతోపాటు పెండింగులో ఉన్న బిల్లులు ఆమోదం పొందాలని కోరుకుంటున్నాం. దేశానికి ఇవి చాలా ముఖ్యమైనవి. అందువల్ల ప్రతిపక్షాలు సహకరించాలని కోరుతున్నాం’’ అని చెప్పారు.