
జియో సంచలనం:మూడునెలల్లో 5 కోట్లు
ముంబై: సంచలనాలకు కేంద్రంగామారిన రిలయన్స్ జియో టెలికాం మరో ఘనతను సాధించింది. ఉచిత కాలింగ్ , ఉచిత డాటా అఫర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న జియో తాజాగా అయిదు కోట్ల ఖాతాదారుల మైలురాయిని అధిగమించింది. జియో లాంచ్ చేసిన తరువాత కేవలం మూడునెలల్లో (83 రోజులు) ఈ రికార్డు స్థాయి ఖాతాదారులను నమోదు చేసింది. మార్కెట్ లీడర్ భారతి ఎయిర్ టెల్ కు 50 మిలియన్ల ఖాతాదారుల మైలు రాయిని దాటడానికి12 ఏళ్లు పడితే, వోడాఫోన్, ఐడియాకు 13 సం.రాలు పట్టిందని విశ్లేషకులు లెక్కలు చెప్పారు. అతివేగంగా వృధ్ది చెందుతున్న సంస్థగా రిలయన్స జియో ఇన్ఫోకాం నిలిచిందని తెలిపారు.
పరిశ్రమ అంచనాలకు మించి నిమిషానికి వెయ్యి కస్టమర్ల చొప్పున సాధిస్తోంది. రోజుకు సగటున 6 లక్షల ఖాతాదారులను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్ , స్కైప్ లను మించిన ఆదరణ పొందుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో అతి పెద్ద డిజిటల్ సేవలు అందిస్తున్న ఏకైక సంస్థగా అవతరించిందని పేర్కొన్నాయి.
మరోవైపు జియో సిమ్ లతో టెలికాం రంగంలో పెను ప్రకంపనాలను నాంది పలికిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ టెలికాం కంపెనీలు ట్రాయ్‌కి ఫిర్యాదు చేయడం ద్వారా ప్రత్యక్ష యుద్ధానికి దిగినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఉచిత ఆఫర్‌ను మరో మూడు నెలలపాటు (2017 మార్చి వరకు) పొడిగించారు. మరోవైపు డిసెంబర్ 28న ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడున్న ఉచిత సర్వీస్‌తోపాటు వెల్‌కమ్ ఆఫర్- 2017 ఏడాది చివరి వరకు పొడిగించే అవకాశం ఉందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే దేశంలోని టెలికాం దిగ్గజాలకు కష్టకాలమే అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మరి నిజంగా రిలయన్స్ అధినేత మరో సంచలనానికి తెర తీస్తారా లేదా తెలియాలంటే మాత్రం డిసెంబర్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే.