
విభజనపై అపోహలు తొలగించండి: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేస్తూ వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి అన్నారు. ఇందుకోసం పీఆర్‌టీయూ ముందుండి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగులకు భద్రత ఉండదని, చిక్కులు వస్తాయంటూ కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, సీమాంధ్ర ఉద్యోగులు కావాలనే ఆందోళనలు చేస్తున్నారేమోనని అన్నారు. వాటిని తిప్పికొట్టేవిధంగా ఉపాధ్యాయులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.
సోమవారం హైదరాబాద్‌లోని పీఆర్‌టీయూ భవన్‌లో యూనియన్ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం’- అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జానారెడ్డి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగితే సమస్యలు వస్తాయా? ప్రభుత్వం చేయాల్సిందేమిటి? అనే అంశాలపై సీమాంధ్ర ఉద్యోగులకు తెలియజేసేలా, అందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టేలా ఆచరణాత్మక నివేదికను రూపొందించాలని జానారెడ్డి పేర్కొన్నారు. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయడంతోపాటు ప్రజలకు తెలియజేయాలన్నారు.
ఉద్యోగులకు సంబంధించి పదో పీఆర్‌సీ నివేదిక త్వరగా వచ్చేలా కృషిచేస్తామని, ఒకవేళ ఆలస్యమైతే మధ్యంతర భృతి త్వరగా ఇచ్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు సమస్యగా ఉన్న ఆర్టికల్ 371-డిని తొలగించాల్సిన అవసరం లేదని, సవరణకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సమైక్య ఉద్యమం మీడియా వల్లే వచ్చిందని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. హైదరాబాద్‌లో వందల ఎకరాలు ఉన్న వారు, పెట్టుబడిదారులు కొంతమంది ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్నారు. సీమాంధ్ర ఉద్యోగులది గంటన్నర, రెండు గంటల ఉద్యమమని అన్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగులకు భద్రత లేదన్న వాదన సరికాదని సమాచార శాఖ మంత్రి డీకే అరుణ అన్నారు. విభజన సమయంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తారని, అందులో పంపకాలు, సర్వీసు రూల్స్ అన్నీ చర్చించి నిర్ణయిస్తారన్నారు.
తెలంగాణ ప్రక్రియకు కృషి చేయండి: ఎమ్మెల్సీలు
పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు న్యాయం చేసేలా 371-డి సవరణకు, తెలంగాణ ఏర్పాటును వేగవంతం చేసేందుకు ఇక్కడి మంత్రులు, ఎంపీలు కృషి చేయాలని ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి మంత్రులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, వారింట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. 371-డిలో ప్రభుత్వ టీచర్లు అనేది ఉందని, పంచాయతీరాజ్ అనేది లేనందున లక్షల మంది టీచర్లు అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త సర్వీసు రూల్స్ తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.