ఏపీ భవన్ లో రేణుకా చౌదరికి రామయ్య సెగ
న్యూఢిల్లీ : ఏపీభవన్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీమాంధ్రలో భద్రాచలం ముంపు గ్రామాలను కలవ వద్దంటూ తెలంగాణ విద్యార్థి జేఏసీ శనివారం ఏపీభవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది. అయితే ఈ ధర్నాకు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరిని ఆహ్వానించడంపై జేఏసీలోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో ఉద్రిక్తత ఏర్పడింది. రేణుకా గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తింది. దాంతో ఉద్యోగ సంఘాలు, విద్యార్థుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
కాగా విద్యార్థి జేఏసీ ధర్నాకు రౌణుకా చౌదరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. భద్రాద్రి రాముడి ఆలయాన్ని కాపాడుకోవటం తమ లక్ష్యమన్నారు. రామాలయ ఆస్తులపై తెలంగాణ బిల్లులో స్పష్టత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకే తాను వచ్చానని రేణుక తెలిపారు.