జైత్రయాత్ర రసాభాస
టేకులపల్లిలో రేణుక, మంత్రి రాంరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ
కారేపల్లిలో వాహనంపై గుడ్లు విసిరిన తెలంగాణవాదులు
సాక్షి, కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో ఎంపీ రేణుకాచౌదరి చేపట్టిన భద్రాచలం జైత్రయాత్ర ఆదివారం రసాభాసగా మారింది. రేణుక గోబ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు వద్ద ఆమె వర్గీయులు, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు పరస్పరం దాడులకు దిగారు. తోపులాట, నినాదాలతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది.
రేణుక అనుచరులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టేకులపల్లి సభలో రేణుక మాట్లాడుతూ.. ‘మూతి మీద మీసం ఉంటే మగాడు కాదు.. మహిళలను ఆదరించి ముందుకు నడిపేవాడే మగాడు అవుతాడు. నాతో పనులు చేయించుకున్నప్పుడు ఎక్కడి ఆడబిడ్డనో గుర్తుకు రాలేదా..?’ అంటూ మంత్రి రాంరెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. తన వర్గీయులపై దాడి జరిగిందని సమాచారం అందుకున్న ఆమె మళ్లీ టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడంతో 50మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు.
అయితే రేణుక సర్పంచ్‌ను కులంపేరుతో దూషించారని.. ఆమెపై కేసు నమోదు చేయాలని మంత్రి వర్గీయులు టేకులపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. కాగా, కారేపల్లిలోనూ రేణుకకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. మంత్రి అనుచరులతో సహా టీఆర్‌ఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యకర్తలు ఆమె పర్యటనను అడ్డుకున్నారు. ‘తెలంగాణద్రోహి.. రేణుకా గ్యోబాక్’ అంటూ నినదించారు. ‘భద్రాచలం మాది.. పెద్దాపురం మీది’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక్కడ సభలో కూడా పరోక్షంగా మంత్రిపై ఆమె నిప్పులు చెరిగారు. సభ ముగించుకొని ఖమ్మం వైపు వెళ్తున్న ఆమె వాహనంపై బస్టాండ్ సెంటర్‌లో కోడిగుడ్లు విసిరారు. అక్కడ ఉన్న రేణుకాచౌదరి ఫ్లెక్సీలను కూడా చించారు.